రాష్ట్రప్రభుత్వంచే గుర్తింపబడిన ఈ జాతర పుష్యమాసం (జనవరి-పిబ్రవరి) పుష్య అమావాస్యరోజు ప్రత్యేక పూజతో మొదలవుతుంది. ఈ పూజలన్నీ ఒకే వంశస్తుల మీదుగా జరపటం అనాదిగా వస్తున్న గిరిజనుల ఆచారం. వారం రోజు పాటు జరిగే ఈ జాతరకు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారు.
జాతర.......ఆదివాసీ తెగలో స్రధాన్ సమాజానికి చెందిన మెస్రం వంశంలోని బోయ్‌గోట్టే అనే విభాగానికి చెందినవారు జాతరలో దేవతకు పూజలు చేస్తారు. అక్కడ ప్రచారంలో ఉన్న ఇతిహాసం ప్రకారం సుమారు 550 సం॥ ల క్రితం ఆ వంశం వారిలో ఒకరికి మహమ్మారి సోకింది. ఏడుగురు అన్నదమ్ములలో ఒకరు తప్ప మిగతా ఆరుగురు సోదరులూ చనిపోతారు. తరువాత దేవత ప్రత్యక్షమై చుట్టుప్రక్కల 125 గ్రామాలను సందర్శించి హస్తిన మడుగులో స్నానమాచరించి గంగాజలంతో ఏటా పుష్యమాసం అమావాస్య రోజు అభిషేకం చేయాలని ఆదేశిస్తుంది. ఏడురకాల నైవేద్యాలను సమర్పించాని చెప్పి అదృశ్వమవుతుంది. అప్పటినుండి ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేసి జాతర జరుపుతున్నారు.
ఇంకొక కథనం.... ఆ వంశానికి చెందిన ఏడుగురు అన్నదమ్ముూలూ ఊరు విడిచి ఓ గొల్ల వారింటికి చేరి అక్కడే పన్నేండ్లు పనిచేసి కొంత డబ్బు సంపాదించిన తరువాత స్వగ్రామం కేస్లాపూర్‌కు తిరిగి బయలు దేరుతారు. దారిలో మేనమామ ఇంటిలో బసచేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయలేదనే అక్కసుతో మేనమామను చంపడానికే వారు వచ్చారని మేనమామ కూతురు ఇంద్రావతి అనుకుంటుంది. ఆమె పెద్దపులిగా మారి ఆరుగురు అన్నదమ్ములను చంపివేస్తుది. ఆఖరువాడు మాత్రం సర్పదేవుణ్ణి ప్రార్థించి అతని సహాయంతో ప్రాణాలతో బయటపడి కేస్లాపూర్ చేరుకుంటాడు. తనను కాపాడిన నాగదేవతను గ్రామంలో కొలువు తీరాలని వేడుకుంటాడు.
నాగోబా దేవత అంగీకరించి అక్కడే స్థిరపడుతుంది. మెస్రం వంశంలోని బోయేగొట్టే తెగవారు తనతోపాటు 16 ఆడ(సతి) 18 మగ (కామ) దేవతలను ప్రతిష్టించి పూజలు చేయాలని ఆదేశిస్తుంది.
జాతర విశేషాలు: జాతర ప్రారంభానికి ముందు కేస్లాపూర్‌లోని ఆలయంలో మెస్రం గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలకు అవసరమయ్యే మట్టి కుండనూ తరతరాలుగా ఒకే వంశానికి చెందిన వాళ్ళే తయారు చేస్తారు. కుండ తయారీ ముగిసేలోగా కటోడా అనబడే గుడి పూజారి, ప్రధాన్ ఎడ్లబండిపై మెస్రం వంశ గిరిజనుల నివాసం ఉండే గ్రామాలకు వెళ్లి జాతర తెదీను తెలియచేస్తారు.
ప్రచారం ముగిశాక ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరువాత ఆ వంశానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కాలి నడకన పవిత్ర జలం తేవడానికి గోదావరి నదికి బయల్దేరతారు. జన్నారం మండంలోని కలమడుగు గ్రామం సమీపంలోని హస్తిన మడుగు నుంచి జలాన్ని తీసుకొని తిరుగు ప్రయాణమవుతారు. దారిలో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి ఆలయానికి చేరుకొని మొక్కు తీర్చుకుంటారు. అనంతరం కేస్లాపూర్ గ్రామ శివారులోని మర్రిచెట్ల దగ్గర మూడు రోజుల పాటు బసచేస్తారు. ఆ వంశం వారిలో ఏడాది కాలంలో మృతి చెందిన పితృలకు పూజు చేస్తారక్కడ. వీటిని ‘తూం’ పూజలంటారు. ఇలా చేయడం వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగి దేవతులుగా మారతారని ఆదివాసుల నమ్మకం. ఆ పూజ తరువాత సంప్రదాయ వాయిద్యాలైన డోలు, కాలికోంను వాయిస్తూ నాగోబా ఆలయానికి బయల్దేరతారు. కొత్త దంపతులు ముందుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఏడుగురు పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆలయం పక్కనే మట్టితో పుట్ట తయారు చేస్తారు.
మరో ప్రథాన కార్యక్రమం భేటింగ్... కటోడా, ప్రధాన్‌తోపాటు మరో ఐదుగురు గంగాజలంతో ఆయాన్ని శుద్ధి చేస్తారు. రాత్రి 10 గంటల తరువాత జిల్లా కలెక్టర్ ఐటిడి ఎ పి ఓలు, ఇతర జిల్లా అధికారులు సమక్షంలో నాగోబాకు నవధాన్యాలతో పూజు చేస్తారు. మెస్రం వంశీయులోని కోడళ్లందరూ ఒకరికొకర్ని పరిచయం చేసేందుకు భేటింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భేటింగ్ రోజు తెల్లని వస్త్రాలు ధరించి మొహాలు కనిపించకుండా ఆలయంలోకి వెళ్తారు. నాగోబా దేవతకు పూజలు చేసి రాత్రి 12 గంటల తరువాత భేటింగ్ నిర్వహిస్తారు.
జాతర ముగింపు ఉత్సవం..మండగాజలీ.. గిరిజనుల నాగోబా ఆలయం సమీపంలో మండగాజలి అనే వేడుకను నిర్వహిస్తారు. ఆడవారు ఆటపాటలతో అలరిస్తారు. మగవాళ్లు కర్రసాము చేస్తారు. తరవాత ఆలయంలోకి వెళ్ళకుండా బయట నుంచే దేవతను మొక్కుకొని ఊట్నూరు మండంలోని శ్యాంపూర్ బుడందేవ్ జాతరకు ప్రయాణమవుతారు. అక్కడ పూజలు నిర్వహించి ఇళ్లకు చేరుకుంటారు.
నాగోబా గుడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం, కెస్లాపూర్ గ్రామంలో ఉన్నది. హైదరాబాద్‌కు 326 కి.మీ. దూరం. (రోడ్డు మార్గం హైదరాబాద్-సిద్ధిపేట-కరీంనగర్-రామగుండం-మందమర్రి మీదుగా వెళ్లవచ్చు)
రైలు మార్గం :హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ 492 కి.మీ.(హైదరాబాద్-నిజామాబాద్-ఆదిలాబాద్) టౌన్‌కు రైలు మార్గంలో వెళ్ళవచ్చు. అక్కడనుండి 38 కి.మీ దూరంలో ఉన్న కెస్లాపూర్‌కు రోడ్డు మార్గం (బస్సులో) ద్వారా వెళ్ళవచ్చు.