సమున్నతమైన ఆశయంకోసం, జనం కోసం, నమ్ముకున్న వారి కోసం ప్రాణాల్ని సైతం తృణపాయంగా అర్పించిన అమరవీరుల్ని దైవస్వరూపులుగా భావించి పూజించి వారికి కృతజ్ఞాతా పూర్వకంగా మొక్కుబడులు సమర్పించుకోవటం గిరిజనుల సాంప్రదాయం.
సమ్మక్క సారమ్మ త్యాగాలకు గుర్తుగా ప్రారంభమైనది సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ప్రజలకు ఆపద వచ్చినపుడు యుద్ధానికి నడుం బిగించి ఆ పోరులో ప్రాణాలు అర్పించిన గిరిజన వీరులు వీరు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మాఘమాసంలో జరుగుతుందీ జాతర. ఆసియాలోనే అతి పెద్ద జాతలరలో ఒకటిగా పేరుగాంచిన జాతర ఇది.
2109 వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఘనంగా జరిగుతుంది. ఈ ఉత్సవాల వెనుక చాలా చరిత్ర ఉంది.
13వ శతాబ్బంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలంలో గోదావరి తీర ప్రాంతం మేడరాజు అనే కోయదొర ఏలుబడి క్రింద ఉండేది. ఒక రోజు వేటకు వెళ్ళిన కోయదొరకు పులి సంరక్షలో ఉన్న పసిపాప కనబడుతుంది. మేడరాజు ఆ పాపకు సమ్మక్కని పేరు పెట్టుకొని పెంచుకొంటాడు.
యుక్తవయస్కురాలైన సమ్మక్కను కాకతీయుల సామంతుడు మరియు తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేస్తాడు. పగిడిద్దరాజు మేడారం ప్రాంతానికి కోయదొర. ఇతనికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే వారు సంతానం. కాకతీయులకు వీరు ప్రతి సంవత్సరం కప్పం కట్టేవారు.
కరవు కాటకాల మూలకంగా ఓ ఏడాది కప్పం చెల్లించలేకపోయారు. ఓరుగల్లు వారు వీరి విన్నపాలను మన్నించలేదు. యుద్ధానికి వస్తారు. గిరిజనుల సైనికబలం తక్కువైనా ఆత్మాభిమానంతో యుద్ధానికి సిద్ధపడతారు. సంపెంగి వాగు ఒడ్డున పోరు భీకరంగా సాగుతుంది. కాని సుశిక్షుతులైన కాకతీయ సైన్యంతో గిరిజనులు తలపడ లేకపోతారు. పోరులో పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ, ఈమె భర్త గోవిందరాజు ప్రాణాలు కోల్పోతారు. శత్రువు చేతికి చిక్కడం ఇష్టంలేక జంపన్న, సంపెంగ వాగులో దూకి ప్రాణత్వాగం చేస్తాడు.
అప్పటి నుండి సంపెంగె వాగు, జంపన్న వాగుగా ప్రసిద్ధి పొందినది. యుద్ధంలో గాయపడిన సమ్మక్క మేడారానికి ఈశాన్యంగా ఉన్న చిలకలగుట్ట వైపుకు వెళ్ళి అదృశ్వమవుతుంది. కోయదొరలు వెతుకగా నెమలినార చెట్టువద్ద పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించింది. అదే సమ్మక్క ఆనవాలని గిరిజనులు నమ్ముతారు. నాటి నుంచి సమ్మక్క సారలమ్మలు వనదేవతలై ఇక్కడ పూజలందుకుంటున్నారు.
జరిగిన ఈ దారుణంతో ప్రతాపరుద్రునిలో పరివర్తన కలిగింది. ఆధ్యాత్మిక చింతనతో సమక్క-సారమ్మకు ఉత్సవాన్ని నిర్వహిస్తాడు. అలా ప్రతాపరుద్రుడు ఏర్పరచిన సంప్రదాయం నేటికి మేడారం జాతరగా కొనసాగుతుంది.
శూరత్వానికి, దీరత్వానికి సంకేతాలైన సమ్మక్క సారలమ్మ రూపాల్ని గిరిజనులు జువ్విచెట్టు కింద ప్రతిష్టించుకొని పూజించసాగారు. కొన్ని శతాబ్దాల క్రితం చిన్న జాతరగా ప్రారంభమై నేడు ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందినది.
జాతర విశేషాలు : వనదేవతలైన సమ్మక్క, సారలమ్మకు రూపాలుండవు. 2 మీ. వ్యాసార్థంలో నిర్మించిన గద్దె (అరుగు) మధ్య గుంజ (కర్ర) పాతి వనం తెచ్చి గద్దెపై చేర్చటంతో జాతర ప్రారంభమవుతుంది. వనం అంటే అడవిలో బండరాతిపై మొలిచే వెదురును మాఘపౌర్ణమికి ముందురోజు తెల్లవారు జామున వనంగా తెస్తారు. పుజారులు కుటుంబ స్త్రీలు నిష్టతో గద్దెను శుభ్రంచేస్తారు. తరువాత కార్యక్రమమంతా మగవారే నిర్వహిస్తారు. జాతరలో భాగంగా మొదటిరోజు సారలమ్మ గద్దెపై కొలువు తీరుతుంది. మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపెల్లి గ్రామంలోని గుడి నుండి సారలమ్మను పూజారులు సంప్రదాయ డప్పు చప్పుళ్లతో తెస్తారు. ఆ సమయంలో పిల్లలు లేని మహిళలు వరం పడతారు. దేవాలయం నుంచి సారలమ్మను తీసుకొచ్చే పూజారులు వీరి వీపుపై నడుచు కుంటూ ఆలయం నుంచి బయటికి వస్తారు. అదే రోజు అదే సమయానికి పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెపైకి వస్తారు.
మేడారానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుండి పూజారులు పగిడిద్దరాజును తీసుకొస్తారు. ఈ కార్యక్రమం అంతా కాలినడకనే సాగుతుంది. మధ్యలో ఒక రోజు విరామం. మళ్ళీ నడక ప్రారంభించి తరువాత రోజు సాయంత్రానికి మేడారానికి చేరుకుంటారు.
అదే విధంగా మేడారం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గొవిందరాజుస్వామిని తీసుకు వస్తారు. మాఘమాసం పౌర్ణమి రోజున చిలకల గుట్టపై నుండి మేడారం గద్దెపైకి (2 కి.మీ. దూరం) చేరుకునే సన్నివేశం ఉత్కంఠతకు గురిచేస్తుంది. పూజలు చేసే విధానం ముగ్గురు పూజారులకు మాత్రమే తెలుసు. మిగతా పూజారులు గుట్ట మధ్య భాగంలో వేచి ఉంటారు. ముగ్గురు పూజారులు కూడా వేరు వేరు దారుల్లో చిలకల గుట్టపైకి చేరుకుంటారు. భక్తులంతా గుట్ట దిగువన అమ్మవారి రాకకోసం ఎదురు చూస్తుంటారు. గుట్టపైన పూజారులు పూజలు జరిపిన తరువాత సమ్మక్క అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణను కిందికి తీసుకువస్తారు. సంకేతంగా కొమ్ముబూర ఊదుతారు. సమ్మక్కను తెచ్చేటప్పుడు మేకలు, గొర్రెలు, కోళ్ళు బలి ఇస్తారు. శివసత్తు పూనకాలు, భక్తుల జయజయధ్యానాల నడుమ సమ్మక్కను గద్దెపైకి చేరుస్తారు. వనదేవతలంతా భక్తజనుల దర్శనార్థం గద్దెపై కొలువు తీరుతారు. తరువాత రోజు సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో మొత్తం నాలుగు రోజు జాతర ముగుస్తుంది.
మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాక పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా జనం తరలివస్తారు. అలా వచ్చే భక్తులు తొలుత మేడారం పొలిమేరలోని జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి స్నానఘట్టాలపై కొలువై ఉన్న జంపన్నను దర్శించుకొంటారు.
కొందరు మహిళలు బంగారం (బెల్లం) పసుపు, కుంకుమ, చీరెతో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు తీరితే నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించటం ఇక్కడ రివాజు. మొక్కు ఉన్నవారు బంగారాన్ని నెత్తిన పెట్టుకుని వస్తారు. సమ్మక్క తల్లిని దర్వించుకుని బంగారం, ఒడి బియ్యం, పసుపు, కుంకుమ సమర్పించుకుంటారు. కొబ్బరికాయు కూడా కొడతారు. ఆ పక్కనే ఉన్న పగిడిద్ద రాజునూ సారమ్మనూ దర్శించుకుంటారు. ఆమె భర్త గొవిందరాజు స్వామిని కూడా దర్శించుకుని ప్రాంగణం నుండి బయటికి వస్తారు.
జాతర సందర్భంగా మేడారం చుట్టుపక్కల సుమారు 80 చ.కి.మీ. విస్తీర్ణంలో భక్తులు విడిది చేస్తారు. జంపన్న వాగులో 3 కి.మీ. పొడవునా భక్తుల స్నానం చేస్తున్న దృశ్యం కుంభమేళాను తలపిస్తుంది.
ఎలా వెళ్లాలి : ఉత్తరాది నుండి వచ్చేవారు హైదరాబాద్ మీదుగా వచ్చి వరంగల్ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కనుండి బస్సులో వెళ్లవచ్చు. అలాగే దక్షిణప్రాంతం నుండి వచ్చేవారు కూడా విజయవాడ మీదుగా వచ్చి ఖాజీపేట లేక వరంగల్‌లో దిగి అక్కడనుండి బస్సులో వెళ్ళవచ్చు. ప్రతి సంవత్సరం కొన్ని నెలల ముందు జాతర తేదీను ప్రకటిస్తారు.