కీసరగుట్ట ... గుట్టంతా శివ లింగాలమయమే. ప్రతి లింగమూ స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపమే. అక్కడ పరమేశ్వరుడు... శ్రీరాముడి చేతుల మీద వెలసి రామలింగేశ్వరుడిగా సేవలందుకుంటున్నాడు.
ఆ పుణ్యక్షేత్రమే... కీసరగుట్ట.
తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందింది కీసరగుట్ట. ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండటంతో కేసరాలు(సింహాలు) గుంపులుగా సంచరించినందు వల్ల ఇది కేసరగిరి అయ్యిందంటారు. ఈ క్షేత్రంలోని విజయ స్తూపం మీది మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, కేసరి, ఆంజనేయ విగ్రహాల ఆధారంగా ఈ క్షేత్రం శైవ, వైష్ణవ సంప్రదాయాల మేలుకలయికగా విరాజిల్లుతోంది. రామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం ఒక విశేషమైతే, స్వామికి చేసిన అభిషేకాల నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ అంతుపట్టకపోవడం మరో విశేషం.
స్థల పురాణం...
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి, హనుమంతుడితో రావణ సంహారం తర్వాత వన విహారానికి వచ్చి ఇక్కడి ప్రకృతి రమణీయతకు పులకించి, కొంతకాలం ఇక్కడ ఉండిపోయారు. రావణుని హతమార్చినందుకు హత్యా పాతక నివారణ కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరాముడు నిర్ణయించాడు. కాశీకి వెళ్లి ఒక జ్యోతిర్లింగాన్ని తేవాల్సిందిగా హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. రామాజ్ఞ ప్రకారం శివలింగాన్ని తెచ్చేందుకు హనుమ కాశీకి వెళ్లాడు. అక్కడ ఆంజనేయుడు శివ మహిమకు ప్రభావితుడై నూటొక్క శివలింగాలను శ్రీరాముని పూజకు తీసుకువచ్చినట్లు పురాణం. ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకురావడంలో కాలయాపన జరగడంతో శ్రీరాముడు శివుని ప్రార్ధించి లింగరూపధారియైన ఆయన విగ్రహాన్ని మహర్షులు నిర్ణయించిన సుముహూర్తానికి ప్రతిష్ఠించి, అభిషేకించి హత్యాపాతకం నుంచి విముక్తిపొందాడు. ఇంతలో కాశీ నుంచి నూటొక్క లింగాలతో తిరిగి వచ్చిన హనుమ శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయడంతో తాను తెచ్చిన లింగాలలో ఒక్క లింగమైనా రామపూజకు నోచుకోనందుకు వ్యథచెందాడు. అది గమనించిన శ్రీరాముడు హనుమను ఓదార్చి తాను ప్రతిష్ఠించిన శివ దర్శనం అనంతరం కాశీ నుంచి తెచ్చిన నూటొక్క శివలింగాలను భక్తులు దర్శించేలా వరమిచ్చాడని పురాణగాథ. ప్రధాన ఆలయం వెనుక ఏకశిలతో ఏర్పడిన సీతమ్మగుహ కూడా భక్తులకు కనువిందు చేస్తుంది.
చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతున్న కీసరగుట్ట మహత్యాన్ని ఎంతగా వర్ణించినా చాలదు, ఒక్కసారైనా సందర్శించి తీరాల్సిందే.
కీసరగుట్ట శివాలయం హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. లేక ECIL నుడి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. సికింద్రాబాద్ లేక హైదరాబాద్ నుండి బస్ సౌకర్యం కలదు