header

Peddamma Gudi......Jubli Hills…పెద్దమ్మగుడి, హైదరాబాద్‌

Peddamma Gudi......Jubli Hills…పెద్దమ్మగుడి, హైదరాబాద్‌

మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. ‘పాహిమాం’ అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే! ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో...బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది.
అదే...జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. ‘పెద్దమ్మ’ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే.. కడు పెద్దమ్మ! ఏడు ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం...జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గుడి! హైదరాబాద్‌ నాలుగు వందల సంవత్సరాల ప్రాచీన నగరం. భాగ్యనగర నిర్మాణానికి చాలా చాలా ముందే ...ఆమాటకొస్తే, వేల సంవత్సరాల క్రితమే జూబ్లీహిల్స్‌ ఆదిమతెగలకు ఆవాసంగా ఉండేదంటారు. వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు.మంచి జరిగితే, నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే, జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాలప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి.
జూబ్లీహిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ, అలనాటి అమ్మతల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. రెండున్నర దశాబ్దాల క్రితం దాకా.. ఇక్కడో చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో... రాత్రిళ్లు అమ్మ అడుగుల సవ్వడులు వినిపించేవని స్థానికులు చెబుతారు. భక్తులకు కల్లో కనిపించి ... తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట.

ఈ ఆలయం జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెం.55 లో ఉన్నది. గుడి చరిత్ర గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కాని దేవాలయం 150 సంవత్సరాల క్రితందిగా చెప్పబడుచున్నది. ఇప్పటి గుడి కాంగ్రేస్‌ నేత పి. జనార్థనరెడ్డి చొరవతో నిర్మించబడ్డది. పి. జనార్థనరెడ్డి అమ్మవారి భక్తుడు. ఈ తల్లి ప్రేరణతో ఆలయ నిర్మాణానికి పూనుకొన్నాడు. 1993లో ప్రారంభమైన ఈ నిర్మాణం ఏడాదికల్లా పూర్తయి హంపి విరుపాక్ష స్వామి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. అదే సంవత్సరంలో రాజగోపురం, లక్ష్మీ, సరస్వతీ ఆలయాలు కూడా కట్టబడినవి.
నవశక్తి మరియు నాగదేవత ఆలయాలు కూడా తరువాత నిర్మించబడ్డవి. ఇక్కడ జరుగు పండుగలలో తెంగాణా ప్రాంతీయమైన బోనాల పండుగ ప్రసిద్ధి చెందినది. పెద్దమ్మ అనగా అమ్మలకు అమ్మ అని ప్రసిద్ధి. 11 మంది గ్రామదేవతలలో ఈ అమ్మ ఒకరు. ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు జరిగే సమయంలో ఈ గుడిని తప్పక దర్శించవసినదే .మరియు రధోత్సవం కూడా ఇక్కడ జరుగు ఉత్సవాలలో ప్రముఖమైనది.
ఉత్సవాలు : పెద్దమ్మ గుడిలో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనవి దసరా నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం నాగదోష పూజలు చేస్తారు. మాఘశుద్ధ పంచమి నుండి సప్తమి వరకు వార్షిక రథోత్సవం కన్నుల పండుగుగా జరుగుతుంది. భక్తుల సౌకర్యం కోసం 40 షెడ్లు మరియు వసతి గృహాలు నిర్మించారు.యాగశాల, పుష్కరిణి కూడా ఉన్నవి
అన్నదానం : ప్రతి మంగళ, శుక్రవారాలో అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అన్నదానానికి విరాళాలు ఇవ్వవచ్చు.
ఎలా వెళ్ళాలి ? : జంట నగరాలలో వివిధ ప్రాంతల నుండి బస్సు సౌకర్యం కలదు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా హైటెక్‌ సిటీ,కొండాపూర్‌ వెళ్ళే బస్సులో ఎక్కి పెద్దమ్మ గుడి వద్ద దిగవచ్చు. సొంత వాహనాలలో వెళ్లేవారు జుబ్లి చెక్ పోస్ట్ నుండి హైటెక్ సిటీ వెళ్లే దారిలో ఉన్న ఈ అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు.