దశరథుడికి ఇచ్చిన మాట ప్రకారం రాముడు అరణ్య వాసం చేస్తున్నప్పుడు భరతుడు తండ్రి మరణ వార్తను చెప్పి తిరిగి ఆయోధ్యకు వచ్చి రాజ్యమేలమంటాడు. రాముడు తన సోదరుని కోరికను తిరస్కరిస్తాడు. అపుడు జాబాలి అనే మహర్షి మాట్లాడుతూ తండ్రే మరణించాక ఇంకా ఆయన మాటకు విలువ ఏమిటి? అనటంతో శ్రీరాము కోపిస్తాడు. జాబాలి పశ్చాత్తాపంతో కఠోరమైన తపస్సు చేసి తరువాత కాలంలో తాడుబందు ప్రాంతంలో హనుమంతుని ప్రతిష్టించుతాడు. మూలవిరాట్టు ఉన్న శిలపైనే వినాయకుడి రూపం ఉండటం ఇక్కడి ప్రత్యేకత
ఆలయంలో ప్రధాన ఉత్సవాలన్నీ శివరాత్రితో మొదలవుతాయి. దీని వెనకో కథ ఉంది. 1927లో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. జనం శివారు ప్రాంతాలను వెళ్ళిపోయి, తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా తాడుబందు ప్రాంతంలో కూడా గుడారాలు వెలిశాయి. ఆ సమయంలోనే శివరాత్రి వచ్చింది. పూజలు చేసుకుందామంటే, ఒక్క శివాలయమైనా కనిపించలేదు. చుట్టూ అడవి అందులోనూ క్రూరమృగ సంచారం ఎక్కువ. బూరుగు వీరయ్య, కొండా రఘురాములు, వీరమల్లయ్య కైలా దైవం, సోమ నర్సయ్య బృందం శివాలయం కోసం గాలిస్తుండగా చెట్ల పొదల మధ్య ఒక భారీ శిల కన్పించింది. ఆ మూర్తిని పరిశీలిస్తే ఆంజనేయుడి పోలికలు ప్రస్పుటం అయాయయి. మహదానందంగా పరిసరాల్ని శుభ్రం చేశారు. విగ్రహానికి అభిషేకాలు జరిపించారు. కొంతకాలానికి స్వయం భూమూర్తి అయిన ఆంజనేయుడికి ఆలయాన్ని నిర్మించారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తరువాత కాలంలో మహముఖద్వారం, కళ్యాణమండపం, భజనమందిరం కట్టించారు. రాజగోపురం కూడా కట్టబడింది.
దుష్టగ్రహపీడితులు ఆలయ ఆవరణలోనే 41రోజులపాటూ ఉండి నిత్యం స్వామికి ప్రదక్షిణలు చేస్తారు. ఇంకా ఇక్కడ సీతారామాలయం, శివపంచాయతనం, నవగ్రహాలు, నాగేంద్రుని ఆలయం ఇక్కడ కొలువై ఉన్నాయి. కార్తీకమాసంలో అధిక సంఖ్యలో భక్తులు వనభోజనానికి వస్తారు.