header

Trikootalayam, Valgonda, Jagityala….త్రికూటాలయం.

Trikootalayam, Valgonda, Jagityala….త్రికూటాలయం.

చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రం జగిత్యాల జిల్లాలోని వాల్గొండ త్రికూటాలయం. ఆధ్యాత్మికతకూ, సహజమైన దృశ్వాలకు నెలవు. శివుడితోపాటు బ్రహ్మ కూడా ఇక్కడ లింగరూపంలో పూజలందుకుంటారు.
కార్తిక మాసానికి సమానమైన మాసం, కేశవుడికి సమానమైన దేవుడు, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవన్నది దీని అర్థం. అలాంటి కార్తికాన్ని శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా చెబుతారు. ఈ పవిత్ర మాసంలో శివకేశవులతోపాటు బ్రహ్మకూడా ఒకేచోట కొలువై పూజలందుకుంటున్న వాల్గొండ త్రికూటాలయ రామలింగేశ్వర స్వామి దర్శనం మరింత ఫలప్రదం. .
ముక్కోటి ఏకాదశినాడు భానుడి లేలేత కిరణాలు ముక్కంటిని తాకే సుందర దృశ్యం, కార్తిక మాసంలో పున్నమి వెన్నెలతో పోటీపడుతూ జరిగే లక్ష దీపోత్సవం, జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాలనిపించే రాముల వారి కల్యాణం... ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం. .
స్థలపురాణం సీతారాములు వనవాసం చేస్తున్న సమయంలో వాల్గొండ పరిసర ప్రాంతాల్లో కొంతకాలం జీవించారని చెబుతారు. ఆ సమయంలో వారు ఇసుకతో చేసిన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజాది క్రతువులు నిర్వహించేవారట. ఆ తర్వాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ సైకత లింగాన్ని గుర్తించి దాని స్థానంలో రాతి శివలింగాన్ని ఏర్పాటు చేశాడని స్థలపురాణం తెలియజేస్తోంది. .
రాముడు నడిచిన నేల కాబట్టి శ్రీరాముడి విగ్రహంతోపాటు బ్రహ్మనూ లింగరూపంలో ప్రతిష్ఠించి నిత్యపూజలూ విశేష అభిషేకాలూ చేయించేవాడని ప్రతీతి. ఆ కారణంగానే ఈ క్షేత్రం త్రికూటాలయంగా పేరుగాంచింది. వాల్గొండ త్రికూటాలయంలోని శివలింగం పన్నెండు పాణ్వస్త్రాలు కలిగి ఉండటంతో ఈ లింగానికి ఒకసారి అభిషేకం చేస్తే పన్నెండు సార్లు అభిషేకం చేసిన పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అన్నిటికంటే ప్రత్యేకమైంది సూర్యకిరణాలు శివలింగాన్ని తాకడం. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజున సూర్యకిరణాలు ఇక్కడి శివలింగం మీద పడే అద్భుత ఘట్టం చోటు చేసుకుంటుంది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి బారులు తీరుతారు. .
శివయ్యకు ప్రత్యేక పూజలు .
త్రికూటాలయంలో కార్తిక మాసం మొత్తం శివలింగానికి విశేష పూజలూ, ఏకాదశ మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలూ, తులసి కల్యాణంతోపాటు లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గ్రహదోషాలు తొలగిపోవడానికి నవగ్రహ హోమాలు చేస్తారు. సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి సోమవారం అన్నపూజను నిర్వహిస్తారు. శివరాత్రి పర్వదినాన శివపార్వతులకు కల్యాణం, వివిధ సేవలూ జరిపిస్తారు. .
రాముల వారి కల్యాణం .
‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ అంటూ వాల్గొండ గ్రామ ప్రజలు చుట్టు పక్కల ప్రాంతాల వారిని ఆహ్వానిస్తారు. సిగ్గు పడుతున్న సీతమ్మ చెంతన నీలమేఘశ్యాముడు ఠీవిగా నిలబడగా లోకకల్యాణం కోసం ఆ ఆదర్శ దంపతులకు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి నాడు భద్రాద్రి తరహాలో గోదావరి నదిలో సీతారాముల విగ్రహాలను తెప్పలమీద ఊరేగించి, విగ్రహాలకు నదీ స్నానం చేయించి వేద మంత్రాల నడుమ ఆలయంలోకి తీసుకువస్తారు. ఆ రోజు హనుమాన్‌ దీక్షలు చేపట్టిన భక్తులు రామనామ కీర్తనలు ఆలపిస్తూ దీక్షావిరమణ చేస్తారు. ఆ సాయంత్రం సీతారాముల కల్యాణం కనులపండగగా జరుగుతుంది. .
ఎలా వెళ్లాలి....? .
వాల్గొండలో కొలువైన త్రికూటాలయాన్ని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. తెలంగాణా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా జగిత్యాల, మెట్‌పల్లి వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది. జగిత్యాల నుంచి నిర్మల్‌, ఖానాపూర్‌ మీదుగా ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. రైలుమార్గం... నిజామాబాద్‌, కాచిగూడ నుంచి మెట్‌పల్లికి పాసింజర్‌ రైలు ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంద్వారా వాల్గొండకు వెళ్లొచ్చు.