header

Bhadrachalam Temple / భద్రాచలం

Bhadrachalam Temple / భద్రాచలం

1730 (17వ శతాబ్దం) ప్రాంతంలో... భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట! తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం... భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి.. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడు.. అని ఆదేశించారట! ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది.
అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు.
మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి.. ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవం.. భద్రాచల శ్రీరామచంద్రుడికి 1674లో ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు!
ఈ విషయం నవాబ్‌ తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా... ఇక నా దగ్గరేమీ మిగల్లేదు ప్రభూ.. అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి.
చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి.. తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేశాడట! ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు... తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు.
భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల నందు రాముడు, సీత మరియు లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం మరియు మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి).
ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయినాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్నది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయినాయి అని మళ్ళీ అతనిని ఆలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలం కి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.
కళ్యాణం
ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతున్నది