ఖమ్మం జిల్లా భ్రదాచలంలోని రామాలయం వద్దనుండి పడమర దిక్కుగా గోదావరి వారధికి అవతల నదీప్రవాహాం మధ్యలో మోతేగడ్డ కనిపిస్తుంది. ఈ దీవిలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని పదమూడవ శతాబ్ధంలో గిరిజనులు తామే నిర్మించుకున్నారు. ఆ దేవాలయం ఇప్పటికీ చెక్కుచెదకుండా ఉంది. సూర్యభగవానుడు ఈ క్షేత్రపాలకుడు. దక్షయజ్ఞంలో పార్వతీదేవి అగ్నినికి ఆహుతి అవుతుంది. పరమశివుడు ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని పంపుతాడు. వీరభ్రదుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసంచేసి దక్షుణ్ణి సంహరిస్తాడు.వీరభద్రుణ్ణి శాంతింప చేయటానికి పార్వతీ దేవి తన అంశతో జన్మించిన భద్రాకాళితో పెళ్ళి జరిపిస్తారు. ఇది మనకు తెలిసిన వీరభద్రుని కథ.
కానీ గిరిజనులు కథ ప్రకారం.......... వీరభద్రడుడనే రాజు గిరిజన యువతియైన భ్రదకాళిని ప్రేమించి, వారి కులపెద్దలను ఒప్పించి వివాహమాడతాడు. ఆ కొండజాతివారికి కొండంత అండగా ఉంటూ దేవుడులాంటి అల్లుడనిపించుకుంటాడు. వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వారికి దేవుడితో సమానమవుతాడు. ఆ కృతజ్ఞతతోనే గిరిజనులు గుడి కట్టించారంటారు.
మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా కళ్యాణోత్వం జరిపిస్తారు. వీరభ్రదుడికి గోటి తలంబ్రాలు తెస్తారురు. ఆడబిడ్డ భద్రకాళికి తాళిబొట్టు, కట్నకానుకలూ భక్తితో సమర్పిస్తారు. శివరాత్రి అర్థరాత్రి లింగోద్భవ సమయంలో వీరభద్ర స్వామి, అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిపిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడిన గిరిజనులంతా ఈ ఉత్సవానికి వస్తారు.
సంతానంలేని మహిళలు శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రాణాచారం పడతారు. అనగా తడి బట్టలతోనే గుట్టపైకి వెళ్ళి ఆలయం చుట్టూ పొర్లదండాలు పెడతారు. స్వామి అనుగ్రహించి ధ్వానస్థితిలో ఉన్న వారికి పండును ప్రసాదంగా ఇస్తాడని వీరి నమ్మకం. కానీ పండు అందకుండానే దుస్తులు తడారిపోతే మరలా స్నానం చేసివచ్చి మరలా పొర్లు దండాలు పెడతారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం, అన్నప్రాశన ఇక్కడే జరిపించటం వీరి ఆనవాయితి.
మెతెగడ్డ దీవి పచ్చగా కకళలాడుతూ ఉంటుంది. ఎంత పెద్ద వరదలు వచ్చినా ఈ దీవి నీటిలో మునగదు. కానీ జులై నుండి నవంబర్ వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండంతో ఎవరూ ఈ దీవికి వెళ్ళరు. నవంబర్ తరువాతనే పూజాదికాలు ప్రారంభమవుతాయి.
అందమైన పరిసరాలతో, సంధ్యాసమయాలు అపూర్వంగా ఉంటాయి. చుట్టుపక్కల ప్రజలకు ఈ దీవి ఒక పర్యాటక ప్రాంతం కూడా.
మొదటి మార్గం :
భద్రాచలాని వెళ్తున్నపుడు వచ్చే సారపాక కూడలి నుండి ఇరవెండి దారిలో నాలుగు కిలోమీటర్ల దూరం తరువాత మోతే నుండి గోదావరి తీరానికి దారి ఉంది. దాదాపు కిలోమీటరు తరువాత గోదావరి తీరంలో మొట్లరేవు కనిపిస్తుంది. అక్కడ నుండి పడవలలో మోతెగడ్డకు వెళ్ళవచ్చు.
రెండవదారి :
భధ్రాచలం పట్టణం నుండి పర్ణశాల, దుమ్ముగూడెం వెళ్ళే దారిలో నాలుగు కిలోమీటర్ల దూరంలో చెన్నంపేట అనే చిన్నగ్రామం ఉంటుంది. ఈ పల్లెనుండి గోదావరి తీరానికి చేరుకొని అటునుంచి నదిలో మోతెగడ్డకు నడచి వెళ్ళవచ్చు . కొంచెం కష్టం అనిపించినా ఒక మధురానుభూతి మిగులుతుంది.