header

వాంకిడి శివాలయం/ vankhidi Shivalayam

వాంకిడి శివాలయం/ vankhidi Shivalayam

రాణీరుద్రమ దేవగిరి రాజు మహాదేవుడితో చేసిన భీకర యుద్ధం ఓ చారిత్రక ఘట్టం. లక్షల మంది సైన్యంతో ఓరుగల్లుపై దండెత్తిన మహాదేవుడితో పదిరోజుల పాటు ప్రత్యక్షంగా పోరాడి, అతడ్ని మట్టి కరపించింది రుద్రమ. ఆ అపూర్వ విజయానికి గుర్తుగా రుద్రమ నిర్మించిన దేవాలయమే వాంకిడిలోని శివకేశవాలయం.
గణపతి దేవుని తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు వీరనారిగా, అపరకాళికగా అంత ఖ్యాతి రావడానికి కారణం ఆమె పదే పదే ఎదుర్కొన్న యుద్ధాలే. స్త్రీ రాజ్యాధికారం చేపట్టిందన్న వార్త వినగానే సామంత రాజులంతా ఒకరితర్వాత ఒకరు తిరుగుబాట్లు మొదలు పెట్టారు. దండయాత్రలకు వరుస కట్టారు. తిరుగుబాటును తొక్కిపట్టడంలోనూ, దండయాత్రలను తిప్పికొట్టడంలోనూ రుద్రమకు రుద్రమే సాటి అనిపించేది ఆమె తీరు. కాకతీయ రాజుల్లో అగ్రగణ్యుడూ, తనకు తండ్రీ అయిన గణపతిదేవుని నుంచి 1262 సంవత్సరంలో రాజ్యాధికారాన్ని చేపట్టింది రుద్రమ.
అప్పటి నుంచి 1289 వరకు - అంటే 27 ఏళ్లపాటు అప్రతిహతంగా పరిపాలన కొనసాగించింది. ఆమె పాలనా కాలంలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నా మరాఠా యాదవ రాజు మహాదేవునితో చేసిన యుద్ధం, దానికి సంబంధించిన విజయం చరిత్రలో లిఖించేంత గొప్పవి. సువిశాల కాకతీయ సామ్రాజ్యం మహిళ చేతుల్లోకి వచ్చిందనే వార్త వినగానే దేవగిరి రాజు మహాదేవుడికి ఏ తాళాలూ లేని బంగారు నిధి కనిపించినట్టయింది. గణపతిదేవుడి కాలం నుంచీ మాటిమాటికీ కాకతీయ సామ్రాజ్యం మీద దండయాత్రలు చేసే అలవాటున్న మహాదేవుడు ఈ సారి లక్షల సైన్యంతో ఓరుగల్లును చుట్టుముట్టాడు. కానీ రుద్రమ వెరవలేదు. దెబ్బతిన్న సింహంలా పోరాడింది. పదిరోజుల భీకర యుద్ధంలో ఆ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది. ఆ రాజును వశపరచుకొని మూడుకోట్ల బంగారు వరహాలు పరిహారంగా కట్టించుకొని శత్రురాజ్యపు ఆర్థిక వెన్నును విరిచి మళ్లీ తిరగబడకుండా అణచివేసింది. చిన్న విజయమా అది... అందుకే యుద్ధం జరిగిన ప్రాంతమంతా - అంటే మరాఠా ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌
ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాంకిడి వరకూ వూరూరా తన విజయానికి గుర్తుగా గుళ్లు కట్టించింది. అందులో వాంకిడిలోని శివకేశవాలయమూ ఒకటి. వందల ఏళ్లలో మిగిలిన ఆలయాలన్నీ కాలగర్భంలో కలసిపోగా ఇది ఒక చారిత్రక సాక్ష్యంగా దర్శనమిస్తుంది.
మరో వెయ్యి స్తంభాలగుడి...
కుమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఉన్న ఈ దేవాలయంలో శివుడూ, విష్ణుమూర్తీ కొలువై ఉన్నారు. అందుకే దీన్ని శివకేశవాలయంగా పిలుస్తారు. ఇది అక్కడ ప్రవహించే చిక్లీ వాగు ఒడ్డున ఉంది. హన్మకొండలోని వేయి స్తంభాల గుడిని పోలి ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. అక్కడి గుడి ముందు ఉన్న నంది విగ్రహంలాగా ఈ ఆలయం ముందు కూడా నంది విగ్రహం ఉండడమేకాక, ఆలయంలోని స్తంభాలూ వేయి స్తంభాల గుడిలో ఉన్న స్తంభాలను పోలి ఉన్నాయి. గుడిలో శివ, కేశవులతో పాటు పోచమ్మ విగ్రహమూ ఉంది. గర్భగుడిలో ఉండే బావి నుంచి సొరంగ మార్గం ఉండేదట. అయితే భక్తులు పూజ చేసే సమయంలో ఈ బావిలో పడిపోవటంతో బావిని మూసి వేశారని పూర్వికులు చెబుతుంటారు. ఆలయానికి నాలుగు దిక్కులా ద్వారాలుండేవట. ముందు ద్వారం మాత్రమే ఇప్పుడు బాగుంది, మిగిలినవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆలయ స్తంభాల రాళ్లను అప్పట్లో ఏనుగుల సాయంతో ఓరుగల్లు ప్రాంతం నుంచి తీసుకొచ్చి నిర్మాణానికి వాడినట్లు చరిత్రను బట్టి తెలుస్తోంది.
పునర్నిర్మాణం...
ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్థులు రూ.40 లక్షల వ్యయంతో దీన్ని పునర్నిర్మించారు. చిక్లీ నది ప్రవాహం వల్ల ఆలయం కోతకు గురికాకుండా చుట్టూ భారీ ప్రహరీని నిర్మించారు. గుడి వెలుపల నవగ్రహాలూ, వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కోవెలలో నిత్య దీపారాధన జరుగుతుంది. శ్రావణ, కార్తిక మాసాలూ, శివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ఐదుగంటలకు ఉత్సవ విగ్రహాలను పల్లకిలో వూరేగిస్తారు. భజన కార్యక్రమాలతో వూరేగింపుగా దేవతలను తీసుకువచ్చి చిక్లీ నదితీరంలో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రథం తాడును లాగితే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వందల మంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున వస్తారు.
ఆలయానికి ఇలా వెళ్లాలి...
ఈ ఆలయానికి వెళ్లాలంటే కాజీపేట, దిల్లీ రైలు మార్గంలో రెండు స్టేషన్లు ఉన్నాయి. ఒకటి కాగజ్‌నగర్‌, రెండోది ఆసిఫాబాద్‌ రోడ్డు(రెబ్బెన). ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వెళితే కాగజ్‌నగర్‌లో దిగాలి. ప్యాసింజర్‌ రైళ్లైతే ఆసిఫాబాద్‌రోడ్డులో దిగాల్సి ఉంటుంది. కాగజ్‌నగర్‌ నుంచి వాంకిడి వరకు 45 కిలోమీటర్ల దూరం, ఆసిఫాబాద్‌ నుంచి అయితే 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల నుంచి ప్రతి అరగంటకూ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.