మహబూబ్నగర్ జిల్లా గంగాపురంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవుడు. అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో గంగాపురం చెన్నకేశవస్వామి ఆలయం ఒకటి. ఇక్కడ గర్భాలయంలో కొలువుదీరిన మూల విరాట్టు శంఖం, చక్రం, గద, కమలాలను ధరించి భక్తులకు దర్శనమిస్తాడు
స్థలపురాణం
ఇక్కడ చెన్నకేశవుడు స్వయంభూగా వెలసి పూజలందుకుంటున్నాడు. స్వామి వెలసిన ఆ ఊరే నేటి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం లోని గంగాపురం.
చరిత్ర పరంగా....
గంగాపురం చాళుక్య చక్రవర్తుల రెండవ రాజధానిగా పేరుపొందింది. క్రీ.శ. 11వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని త్రైలోక్య మల్లకేశవపురంగా పిలిచేవారని పశ్చిమ చాళుక్య శాసనాల ద్వారా తెలుస్తోంది. పశ్చిమ చాళుక్య రాజైన మొదటి త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు (1042-1062) గంగాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాడు. పశ్చిమ చాళుక్య రాజులు వైజయంతి పురాన్ని రాజధానిగా, గంగాపురాన్ని రెండో రాజధానిగా చేసుకుని పాలించారు. బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూట వంశీయుల కాలం, కందూరు చోడుల కాలంతోపాటు కాకతీయ, గోన, మల్యాల, పద్మనాయకాది రాజవంశీయుల పాలనలో గంగాపురం ప్రముఖ పట్టణంగా వెలుగొందింది. క్రీ.శ. 1091 సంవత్సరం నాటికే లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం ప్రసిద్ధి పొందినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రం గురించి పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు.
లక్ష్మీ చెన్నకేశవస్వామికి శక్తి మేరకు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నేరవేరుతాయని భక్తుల నమ్మకం.
భక్తులు స్వామి వారికి తీపి పదార్థాలను నైవేద్యంగా నివేదిస్తారు. ఉగాది, వైకుంఠ ఏకాదశి, విజయదశమి పర్వదినాల్లో, కార్తీకం, శ్రావణమాసాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ధనుర్మాస ఉత్సవాలు, గోదాదేవి కళ్యాణాలను ప్రతి ఏడు వైభవంగా జరుపుతారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే తిరుకల్యాణం, రథోత్సవం, శకటోత్సవాలు ప్రత్యేకమైనవి. వీటిలో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.
ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఏటా భాద్రపద మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో ఒక రోజు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. అదే రోజు సాయంత్రం ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనాంబరం శివాలయం (పరుసవేదీశ్వరాలయం)లోని లింగంపై కిరణాలు పడతాయి. ఈ శివాలయానికి ఆనుకొనే దుందుభి వాగు ఉంటుంది. గుడికి తూర్పుదిశలో దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న ఈ వాగును మొదట దేవసేనానది అని పిలిచేవారు
ఎలా వెళ్లాలి......
మహబూబ్నగర్ నుంచి గంగాపురానికి 22 కిలోమీటర్ల దూరం. ఇక్కడికి రైలు, రోడ్డుమార్గాలు ద్వారా వెళ్లవచ్చు. హైదరాబాద్ బెంగళూరు హైవే మీదుగా ప్రయాణించి జడ్చర్ల దగ్గర దిగి, అక్కడి నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే జడ్చర్ల స్టేషన్లో దిగి, అక్కడి నుంచి అయిదు కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి చెన్నకేశవ ఆలయానికి చేరుకోవచ్చు.