header

Edupayala Vanadurga Devi Temple..ఏడుపాయల వనదుర్గాదేవి దేవాలయం

Edupayala Vanadurga Devi Temple..ఏడుపాయల వనదుర్గాదేవి దేవాలయం

మెదక్‌జిల్లా పాపన్నపేట సమీపంలో ఏడుపాయల గుట్టలో వనదుర్గాదేవి ఉత్సవం ప్రతి శివరాత్రికి మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకునేందుకు దాదాపుగా 15 లక్షల మంది వస్తారు. మన రాష్ట్రంనుండే కాక పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర నుండి కూడా వేలాదిగా భక్తులు వస్తారు.
కొండకోనలలో ప్రవహిస్తున్న మంజీరా నది ఇక్కడకు వచ్చేసరిగా ఏడుపాయలుగా చీలుతుంది. ఇక్కడే కొండగుట్ట సొరంగంలో అమ్మవారు వనదుర్గామాతగా వెలసిందంటారు. పోతురాజు నృత్యాలు, శివసత్తుల పూనకాలు, బోనాలు, బండ్ల ఊరేగింపుతో జాతర సందడిగా ఉంటుంది.
జాతర మొదట రోజు మంజీరానదిలో స్నానాలతో మొదలవుతుంది. ఆరోజునుంచి స్త్రీలు అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. పసుపు కలిపిన బియ్యంలో ఎండువక్కలు, ఖర్జూరాలు, కుడుములు, తమలపాకులు, రవికె, కొత్త చీరెను ఉంచి వనదుర్గాదేవికి మొక్కులు చెల్లించుకుంటారు.
రెండవరోజు అమ్మవారికి ఫలహారబండ్ల ఊరేగింపు, మూడోరోజు రధోత్సవం వైభవంగా జరుగుతాయి. వనదుర్గాదేవి ఆలయంతో పాటు ఇక్కడున్న తపోభూమి, పాపాల మడుగు, సంతానగుండం, ముత్యాలమ్మగుడి, శివాలయం, వంటి చోట్ల కూడా భక్తులు పూజలు చేస్తుంటారు.
అమ్మవారి ఆలయం ముందు పెద్ద బండరాయుపై ఒక జంట మాత్రమే స్నానం చేయటానికి గుండం ఉంది. సంతానం లేని దంపతులు ఈ గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. జాతర సమయంలోనే కాక మిగతా రోజులలో కూడా పిల్లలు లేని దంపతులు ఈ గుండంలో స్నానం చేస్తుంటారు.
ఏడుపాయలు.....ద్వాపర యుగాంతంలో పాండవ వంశంలోని అర్జునుడి మనవడు, అభిమన్యుని పుత్రుడు పరీక్షత్తు మహారాజును శాపఫలితంగా సర్పరాజైన కర్కోటకుడు కాటువేసి చంపుతాడు. పరీక్షత్‌ మహారాజు పుత్రుడు జనమేజయుడు సర్పజాతి మీద పగబట్టి సర్పజాతిని అంతం చేయటానికి ఏడుగురు మహర్షుల సాయంలో యజ్ఞం చేస్తాడు. ఆనాడు యజ్ఞం జరిగిన ప్రాంతం ఇదేనంటారు. యజ్ఞగుండంలో ఆహుతి ఐన సర్పాలకు సద్గతులు కలిగించడానికి గరుడుడు పాతాళంలో ప్రవహించే భోగావతి నదిని భూమీ మీదకు తీసుకు వస్తే ఆ నది ఏడుపాయలుగా చీలి ఏడు యజ్ఞగుండాల మీదుగా ప్రవహించిందని పురాణ గాధ.
ఆనాటి భోగావతి నదియే నేడు మంజీరా నదిగా పేరుమారిందని చెబుతారు. ఇక్కడ ఉన్న నది ఏడుపాయలను జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, భరద్యాజ, గౌతమ అని ఏడుగురు ఋషుల పేర్లుతో పిలుస్తారు.