header

Saleswara Kshetram…సలేశ్వర క్షేత్రం.

Saleswara Kshetram…సలేశ్వర క్షేత్రం....

ప్రకృతి ఒడిలో కొలువైనట్లుగా కనిపించే సలేశ్వరుడి క్షేత్రం నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలో ఉందీ. ఇక్కడ ప్రత్యేకత ఏడాదిలో (చైత్ర పౌర్ణమికి) అయిదు రోజులు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతి ఉంటుంది. కొండకోనల్లో నడకదారి కూడా లేకుండా సాగే ఈ ప్రయాణాన్ని తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేర్కొంటారు.
చైత్ర పౌర్ణమికి అయిదురోజులపాటు (మార్చి- ఏప్రిల్) లింగమయ్యకు ప్రత్యేక ఉత్సవాలను జరుగుతాయి.
ఈ జాతరలో పాల్గొనడానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచీ లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. శివయ్యను దర్శించుకుని సంతసిస్తారు. అంతేకాదు తరతరాలుగా స్థానిక చెంచులే ఈ జాతరను నిర్వహించడం విశేషం.
ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు నల్లమల అడవుల్లో సలేశ్వర జలపాతం దగ్గర కొంతకాలం గడిపారట. ఈ క్రమంలోనే కొండ గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించారట. పాండవులు సలేశ్వరం గుహల్లో తపస్సు చేసి, అక్కడే కొలువైన శివుణ్ణి ఆరాధించేవారని పురాణ కథనం. కొండల నడుమ ఈశ్వరుడు వెలసిన ప్రాంతం కావడంతో ఈ క్షేత్రాన్ని పూర్వం సర్వేశ్వరంగా పిలిచేవారట. కాలక్రమంలో అది సలేశ్వరంగా ప్రసిద్ధి చెందింది.
కోర్కెలు తీర్చే లింగమయ్య
సలేశ్వర క్షేత్రానికి చేరుకోగానే మొదట గుండంలో స్నానాలు చేసి ఆ తర్వాత లింగమయ్యను దర్శించుకోవడం ఆనవాయితీ. అలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. తమ చేతులతో తామే స్వయంగా స్వామిని పూజించిన భక్తులు వాళ్లవాళ్ల కోర్కెలను శివయ్యకు విన్నవించుకుంటారు. అంతేకాదు తిరుగు ప్రయాణంలో కోరిన కోర్కెలు త్వరగా నెరవేరాలని వివాహం కానివాళ్లు చలువ పందిళ్లు వేస్తారు. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్లు రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి మరోసారి ఆ లింగమయ్యకు మొక్కుకుంటారు. ఈ క్షేత్రానికి వచ్చి శివయ్యను దర్శించుకుంటే ఏడాదంతా పంటలు బాగా పండుతాయన్నది రైతుల విశ్వాసం. కష్టమైన ఈ నడక ప్రయాణాన్ని సాగిస్తున్న భక్తులు ‘వస్తున్నాం లింగమయ్యా’ అంటూ, దర్శనానంతరం తిరిగి వెళ్తూ ‘వెళ్లొస్తాం లింగమయ్యా’ అంటూ చేసే అప్పనాల వల్ల ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది.
మిగతా ఉత్సవాలతో పోలిస్తే సలేశ్వర క్షేత్రంలో ఉత్సవాలు భిన్నంగా జరుగుతాయి. ఇక్కడ భక్తులే స్వామివారిని స్వయంగా పూజిస్తారు. అంతేకాదు నల్లమల ప్రాంతానికి చెందిన చెంచుగూడేల వారే ఆలయ కమిటీగా ఏర్పడి శివయ్యకు ఉత్సవాలు నిర్వహిస్తారు. జాతర జరిగే అయిదు రోజులూ స్వామిని రేయింబవళ్లూ దర్శనం చేసుకునే వీలుంటుంది. ఈ సమయంలో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా స్థానిక యువకులే ప్రత్యేక వలంటీర్లుగా ఏర్పడి 24 గంటలూ సేవలందిస్తారు. వీరితోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా నడకదారిలో భక్తులకు ఆహారం, మంచినీటి సదుపాయాలను కల్పిస్తున్నాయి.
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఎలాంటి దారీతెన్నూ లేని మార్గం మీదుగా సలేశ్వర క్షేత్రాన్ని చేరుకోవడం ఓ సాహస యాత్రే. కొండల్లో రాళ్లూ రప్పలూ దాటుకుంటూ సుమారు ఎనిమిది కిలోమీటర్లు సాగే ఈ నడక ప్రయాణం అత్యంత కష్టమైంది. మొత్తం మూడు కొండలు ఎక్కి దిగాలి. ఇంత కష్టమైన యాత్రలో కూడా చిన్నాపెద్దా అని తేడాలేకుండా అన్ని వయసులవాళ్లూ కర్రల సహాయంతో నడక సాగిస్తారు. మార్గమధ్యంలో శివుడికి అప్పనాలు పెట్టుకుంటూ సలేశ్వర క్షేత్రానికి చేరుకుంటారు. ఇంత క్లిష్టమైన యాత్ర కాబట్టే దీన్ని తెలంగాణ అమర్నాథ్ యాత్రగా భక్తులు భావిస్తారు.
ఎలా వెళ్లాలి...?
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరంలో సలేశ్వర ఆలయం ఉందీ. రెండు మార్గాలు నుండి వెళ్లవచ్చు. . శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఫర్హాబాద్ వరకూ రోడ్డుమార్గం ఉంటుంది. అక్కడి నుంచి రాంపూర్ వరకూ మట్టిరోడ్డులో వెళ్లాల్సి ఉంటుంది. రాంపూర్ వరకే వాహనాల్లో వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి కాలినడకన ఆరు కిలోమీటర్లు కొండ ప్రాంతంలో ప్రయాణించి స్వామిని చేరుకోవచ్చు. లింగాల నుంచి అప్పాయపల్లి మీదుగా గిరిజన గుండాల వరకూ వెళ్లి, అక్కడి నుంచి మరో ఎనిమిది కిలోమీటర్లు నడిచి కూడా ఈ క్షేత్రానికి వెళ్లొచ్చు.