ఆలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉండటం, గర్భగుడిలోని శివలింగంపై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిరంతరం నీడ పడడం... ఛాయాసోమేశ్వరాలయం ప్రత్యేకతలు. సూర్యభగవానుని భార్య, శనీశ్వరుని తల్లి అయిన ఛాయాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం శివలింగంపై నీడపడేలా ఇక్కడ ఆలయం నిర్మించారని పెద్దలు చెబుతారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన ఈ నాటి సమాజానికి సైతం ఆ ఛాయ ఎక్కడి నుంచి పడుతోందన్నది సవాలుగానే ఉంది. ఆనాటి వాస్తుశిల్పుల నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలుస్తోంది ఛాయాసోమేశ్వరాలయం. నల్గొండ జిల్లా పానగల్‌లో ఉన్న ఛాయాసోమేశ్వరాలయాన్ని 12వ శతాబ్దంలో కుందూరు చోళులు నిర్మించారు. త్రికూట ఆలయంగా కూడా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలో శిల్ప సంపద ఎంతో అందంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా దక్షిణం వైపు ముఖ ద్వారంతో ఎనిమిది ఉప ఆలయాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఛాయాసోమేశ్వరాలయాన్ని దర్శించుకుంటే శత్రు నివారణ, శనిదోష నివారణ జరుగుతాయనీ, నర దిష్టి పోతుందనీ భక్తుల విశ్వాసం. ఆలయంలో శివలింగంపైన పడుతున్న నీడ ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం నేటికీ తేలని అంశమే. పలువురు భౌతిక శాస్త్రవేత్తలు, విదేశీయులు సైతం దీనిని పరిశీలించారు. వారంతా కూడా ఇలా జరుగుతుండవచ్చు... అంటూ తమ భావనలు చెప్పారు తప్పితే కచ్చితంగా దీనివల్లనే అని ఎవరూ నిర్ధారించలేకపోయారు. నల్గొండ పట్టణానికి ఉత్తరం దిక్కున పానగల్ గ్రామం ఉంది. ఉదయ సముద్రం చెరువు దిగువన 12వ శతాబ్దంలో కుందూరు చోళరాజులలో ఒకరైన ఏరువ మహారాజు పానగల్‌ను రాజధానిగా చేసుకుని పాలిస్తున్న కాలంలో ఆలయం నిర్మించాడని ఆనాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పానగల్‌లోనే పచ్చల సోమేశ్వరాలయమూ, పానగల్ ఉదయ సముద్రం చెరువుకు పైభాగాన సందనపల్లి సమీపంలో సోమేశ్వరస్వామి ఆలయమూ నిర్మించారు. ఈ ఆలయాలన్నిటినీ పూర్తిగా రాతితో నిర్మించారు. సోమేశ్వరాలయం తెల్లరాయితో, పచ్చల సోమేశ్వరాలయం పచ్చరాయితో నిర్మించారు. మూడింటిలో ప్రధానమైనది త్రికూట ఆలయంగా ఉన్న ఛాయాసోమేశ్వరాలయం. ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం, తూర్పు దిక్కున గల ఆలయంలో సూర్యభగవానుడు, ఉత్తరం వైపునున్న ఆలయంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నారు. ఆలయంలోని గర్భగుడిలో ఒంటరిగా కూర్చుని స్వామిని ధ్యానిస్తూ ఉంటే ఓంకార నాదం విన్పిస్తుందంటారు. ఓంకారనాదం ప్రతిధ్వనించేలా ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం జరిపారని భక్తుల నమ్మకం. ఆ నాదం విన్న అనుభూతిని పొందిన భక్తులు అనేక మంది ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఛాయాసోమేశ్వరాలయాన్ని శివ పంచాయతనం ప్రకారం నిర్మించారని పండితులు చెబుతుంటారు. ఆలయం ప్రాగణంలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి. కాలభైరవుడు, క్షేత్రపాలకుడు, అభయాంజనేయస్వామి, రాజరాజేశ్వరి, వినాయకుడు, కుమారస్వామి ఉన్నారు. నాటి శిల్పులు ఎంతో నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయంలోని అతి పెద్ద నందీశ్వరుడు, శనిదేవుడు, త్రికూట ఆలయం శిఖరంపైన ఉన్న రాతి శిఖరాలు కాలక్రమంలో ధ్వంసమయ్యాయి. మహాశివరాత్రి రోజు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగేది. కాలక్రమేణా ఆలయం నిత్యపూజలకు కూడా నోచుకోని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 సంవత్సరం కృష్ణా పుష్కరాల సందర్భంగా నల్గొండలోని పానగల్ ఛాయాసోమేశ్వరాలయానికి పూర్వవైభవం వచ్చింది. ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణంతో పాటు సిమెంట్ రోడ్డు, కొలను పూడికతీత పనులు జరిగాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆలయం కొలనును అబివృద్ధిపరిచి, పుష్కరఘాట్ నిర్మించారు. ఉదయసముద్రం చెరువు నుంచి నీరు కొలనులోకి వచ్చి బయటకు వెళ్లేలా ప్రత్యేకంగా కాలువ ఉంది. దాంతో భక్తులు కృష్ణా నదిలో స్నానం చేసిన అనుభూతిని పొందుతున్నారు