నల్గొండ జిల్లా మేళ్లచెరువు గ్రామంలో తలమీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంతో స్వయంభూగా వెలసాడు. పుష్కరానికి అంగుళం చొప్పున శివలింగం పెరగటం , శిరస్సు భాగం నుంచి జలం రావడం ఇక్కడి ప్రత్యేకత
ఒకటి మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరీ సమేత శంభులింగేశ్వరస్వామి పంచభూతాలతో కలిసి ఉండే శివలింగం గల ఆలయం పన్నెండో శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని స్థలపురాణాన్ని బట్టి తెలుస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులను మేతకు ఈ ప్రాంతానికి తీసుకు వచ్చేవారు. అక్కడ ఒక పశువుల కొట్టాన్ని కట్టుకొని అందులో ఆ పశువులను ఉంచేవారు. వాటిలోని ఒక ఆవు రోజూ కొట్టంలోని గుండ్రాయిమీద పాలు విడుస్తూ ఉండటాన్ని చూసిన కాపలాదారుడు పల్లెపెద్దలకు తెలియజేస్తాడు. ఆ రోజు రాత్రే పరమశివుడు పల్లెపెద్దలు గంగబోయిన మంగన్న, బోయన్నలకు స్వప్నంలో కనపడి, తాను పరమశివుడిననీ కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నాననీ చెప్పి, తనకు ఆలయాన్ని నిర్మించమని కోరతాడు. పల్లెవాసులు వారి తాహతుకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మిస్తారు. తరువాత కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడని ఆలయగోడలమీద ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువూ దాని అంచువెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు. కాలక్రమంలో అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది.
ఆలయ విశేషాలు.....
ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలకు నెలవు. ప్రధానంగా శివలింగం శ్వేతలింగ రూపులో ఉండటం, వెనకవైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండటంతో భక్తులు శంభులింగేశ్వరస్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. ఇక పానపట్టంమీద ఉన్న లింగమైతే ప్రతి పుష్కరకాలానికీ ఒక అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోందనీ లింగం ముందుభాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమనీ పండితులు చెబుతున్నారు.
శివలింగం శిరస్సు భాగంలో మూడు వేళ్లు పట్టేంత రంధ్రం ఉంది. దీన్నే గంగమ్మ స్థానమంటారు. ఇక్కడినుంచి గంగాజలం ఊరుతూ ఉంటుంది. ఈ జలం ప్రవహించదు కానీ తీస్తున్న కొద్దీ ఊరుతూ ఉంటుందట. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ జలాన్నే తీర్థప్రసాదంగా అందజేస్తారు అర్చకులు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకానంతరం విశిష్ట పుష్పాలంకరణ చేస్తారు.
అయిదురోజుల జాతర
ఇక్కడ ఏటా మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయిదురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలతో ఈ ప్రాంతమంతా భక్తులతో నిండిపోతుంది. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలూ, లింగోద్భవకాల అభిషేకాలూ, శివకల్యాణోత్సవాలను ఇక్కడ వైభవోపేతంగా జరుగుతాయి. చివరి రోజున పవళింపుసేవను కన్నులపండగగా నిర్వహిస్తారు. జాతరలో రెండురోజుల పాటు ఎత్తయిన ప్రభలను ఊరేగిస్తారు. ఈ ప్రభలను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. వీటిని చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ అయిదు రోజులూ పురాణ ప్రవచనాలతో, భాగవతోపన్యాసాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లుతుంది. రాష్ట్రస్థాయిలో ఎడ్లపందేలనూ, వివిధ రకాల ఆటలపోటీలనూ నిర్వహిస్తారు.
ఎలావెళ్లాలి....?
సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఈ ఆలయం. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిలో కోదాడ దగ్గర ఈ క్షేత్రం ఉంది. రైలు ప్రయాణం అయితే మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవచ్చు.