header

Adelli Pochamma / అడెల్లి పోచమ్మ

Adelli Pochamma / అడెల్లి పోచమ్మ

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో వెలసిన మహా పోచమ్మ కరుణామయిగా, కల్పవల్లిగా ప్రసిద్ధిచెందింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు అమ్మను ఆరాధిస్తారు. అడెల్లి పోచమ్మగా, చల్లంగా చూసే చక్కని తల్లిగా మహా శక్తి ఇక్కడ పూజలందుకుంటోంది. సెప్టెంబరు 23, 24 తేదీల్లో ఆ శక్తిస్వరూపిణికి ‘గంగ’ నీళ్ల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది.
అడెల్లి గ్రామంలో వెలసిన మహా పోచమ్మ క్షేత్రం విశిష్టతను సంతరించుకుంది. ఏకశిలపై కొలువుతీరిన అమ్మవారు చేతిలో త్రిశూలం, ఢమరుకంతో దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో శివశక్తి స్వరూపిణి అయిన పోచమ్మ తనతోపాటు ఆరుగురు అక్కచెల్లెళ్లతో కలసి పూజలందుకుంటోంది. శివపార్వతుల ఏడుగురు కుమార్తెలయిన బ్రహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు గర్భగుడిలో ఉన్నాయి. ఇలాంటివి దేశంలో మరెక్కడా ఉండవని వేద పండితులు చెబుతున్నారు.
పరశురాముడు ఈ ప్రాంతంలో పర్యటించాడనీ, అప్పుడే పోచమ్మ గద్దెను ఏర్పాటు చేశాడనీ చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఎంతో శక్తిగల పోచమ్మ తనను నమ్మిన వారిని చల్లంగా చూస్తుందనేది ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అడెల్లి మహా పోచమ్మ ఆలయం భక్తుల తాకిడితో ప్రతి ఆదివారం జాతరను తలపిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల పచ్చదనాన్ని పానుపులుగా చేసుకున్నట్లుండే ఆలయ పరిసర ప్రాంతాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి
స్థలపురాణం ప్రకారం పూర్వం అడెల్లి ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించి తినడానికి తిండిలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యాల బారిన పడి ప్రజలు చనిపోవడం వల్ల వూళ్లకు వూళ్లే శ్మశానాలుగా మారిపోయాయి. దిక్కు తోచని ప్రజలు తమను కాపాడమని శివుడిని ప్రార్థించారు. భక్తుల మొరను ఆలకించిన ఆయన ఈ ప్రాంతానికి రక్షకురాలిగా తన కుమార్తె అయిన పోచమ్మను పంపించాడు. తండ్రి ఆదేశాలతో భువికి చేరుకున్న పోచమ్మ ప్రజలకు అండగా నిలిచింది. సమృద్ధిగా వానలు కురిపించి కరవును రూపుమాపింది. అప్పటినుంచీ అమ్మవారు భక్తులు కోరినకోర్కెలు తీరుస్తూ ఈ అడవిలోనే ఉండిపోయిందని ఇక్కడి భక్తుల విశ్వాసం.
జాతర ఇలా...
నవరాత్రులకు ముందు గంగనీళ్ల జాతరను చేస్తారు. దసరాకు ముందు వచ్చే (అమావాస్య తర్వాత) శని, ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. శనివారం గర్భగుడిలోని పోచమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బాజాభజంత్రీలూ, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారు ధరించిన అన్ని ఆభరణాలనూ తీసుకుని సాంగ్వీ సమీపంలోని గోదావరి తీరానికి చేరుకుంటారు. సారంగాపూర్, యాకర్పల్లి, గొడిసెర, వంజర్, ప్యారమూర్, కదిలి, దిలావార్పూర్, కంజర్ గ్రామాల మీదుగా సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి®, ఆదివారం వేకువ జామున గోదావరి నీటిలో ఆభరణాలు శుద్ధి చేస్తారు. ప్రత్యేక వెండి కడవలో నీటిని తీసుకుని సాయంత్రానికల్లా తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
మార్గమధ్యంలో వూరూరా ప్రజలు అమ్మవారి ఆభరణాలకు మంగళహారతులు సమర్పిస్తారు.స్థానిక కోనేటి నీటిని గోదావరి నీటిలో కలిపి పోచమ్మ విగ్రహాన్ని అభిషేకించి, ఆభరణాలను అలంకరిస్తారు. ఈ క్రతువుతో జాతర ముగుస్తుంది. భక్తులు కూడా ప్రత్యేక పాత్రలతో గోదారి నీటిని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. పంటలు బాగా పండాలన్న ఉద్దేశంతో మిగిలిన నీటిని తమ పంట పొలాల్లో చల్లుకుంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరలో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులూ అధిక సంఖ్యలో పాల్గొంటారు.
పెరుగన్నమే ప్రీతి..
మహా పోచమ్మ తల్లికి పెరుగన్నమంటే చాలా ప్రీతి. అందుకే, అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగుకలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆ ఆలయం చుట్టుపక్కల ప్రదేశాల్లోనే వంటచేసుకుని సహపంక్తి భోజనాలు చేయడం ఆనవాయితీ. పోచమ్మను పసుపుతోనే పూజించడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. అందుకే, ప్రతి ఆదివారం గర్భగుడిలో పసుపు రాశులు దర్శనమిస్తాయి.
ఇలా చేరుకోవచ్చు..
హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో నిర్మల్ జిల్లా కేంద్రం ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 20 కిలోమీటర్లు వెళితే సహ్యాద్రి పర్వతాల దిగువన ఉన్న పోచమ్మ ఆలయాన్ని సందర్శించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి రావడానికి ఆదిలాబాద్, బాసర, మహారాష్ట్రలోని ఇస్లాపూర్ వరకూ రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
మూలం : ఈనాడు