చుట్టూ పచ్చని చెట్లూ వాటికి తోడుగా ఆకాశాన్ని అంటే పర్వత శిఖరాల నడుమ కొలువై ఉందీ పాపహరేశ్వరాలయం. అన్నపూర్ణాదేవితో కలిసి శివయ్య భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న క్షేత్రం నిర్మల్ జిల్లా కదిలి. పరశురాముడు ప్రతిష్ఠించిన లింగంగా, యాగంటి బసవన్నను గుర్తకు తెచ్చే నందిగా.... పరశురాముడికి మాతృహత్యా దోషాన్ని పరిహరించిన ఈ పాపహరేశ్వరుడు నమ్మి కొలిచినవారి పాపాలనూ తొలగిస్తాడని ప్రతీతి.
జమదగ్ని మహర్షి అయిదో కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు కన్నతల్లి రేణుకామాత తలను గొడ్డలితో ఖంఢిస్తాడు. ఆ తర్వాత మాతృహత్యాపాతకానికి ఒడిగట్టిన అపరాధం నుంచి విముక్తిని కోరుతూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఇందులో భాగంగానే దేశంలోని వివిధ ప్రదేశాల్లో 32 శివ లింగాలను ప్రతిష్ఠించి పూజిస్తాననీ, తనకు పాపవిమోచనం కల్గించాలనీ శివుడిని వేడుకున్నాడు. అన్నమాట ప్రకారం భరత ఖండమంతా పర్యటించి వివిధ ప్రదేశాల్లో 31 శివాలయాలను నిర్మించాడు.
చివరిగా దిలావర్‌పూర్‌లోని ఎల్లమ్మను దర్శించుకుని, అమ్మవారి గుడికి ఉత్తరదిశలో ఉన్న లోయల్లో 32వ శివలింగాన్ని ఏర్పాటు చేశాడు. పరశురాముడి భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మాతృహత్యాపాతకం నుంచి విముక్తి ప్రసాదించాడు.
పరశురాముడు పాపం పోయినందుకు సంతోషంతో ‘శివుడు కదిలే’ అంటూ శివతాండవం చేశాడని స్థలపురాణం చెబుతోంది. అప్పటి నుంచీ ఈ ఆలయాన్ని కదిలే పాపన్న ఆలయంగా పిలిచేవారు. కాలక్రమంలో అది కదిలి పాపహరేశ్వరాలయంగా ప్రఖ్యాతి చెందింది. స్వామివారికి వెనక భాగంలో పార్వతీదేవి అన్నపూర్ణగా కొలువై పూజలందుకుంటోంది.
ఆలయంలోని ప్రధాన శివలింగానికి ప్రతి రోజూ వేకువజామునే పంచామృత అభిషేకాలూ, విశేష పూజలూ జరుగుతాయి. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఈ క్షేత్రంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిలో మొదటి రోజున... పుణ్యాహవాచనం, గణపతి గౌరీ పూజలూ, ధ్వజారోహణా ఉంటాయి. మరుసటిరోజున శివపార్వతుల కల్యాణం, పల్లకి సేవ, లింగోద్భవ అభిషేకాలూ జరుగుతాయి. చివరిరోజున నాగవల్లి సేవలూ, అన్నదాన కార్యక్రమాలూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణమాసం మొత్తం అన్నపూర్ణాదేవికి మహిళలు విశేష పూజలూ, నిత్యపారాయణలూ చేపడతారు. ప్రతి సోమ, శనివారాల్లో శివలింగానికి ప్రత్యేక అలంకారాలు చేస్తారు.
సాధారణంగా ఆలయాలు తూర్పు, ఉత్తర ముఖాలు కలిగి ఉంటాయి. ఈ క్షేత్రంలో మాత్రం భక్తులు పశ్చిమ ముఖద్వారం గుండా ప్రవేశించి స్వామిని దర్శించుకుంటారు. పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన శనీశ్వరుడి దృష్టి పాపహరేశ్వరుడిని దర్శించుకున్నవారిమీద పడదు అనడానికి గుర్తుగానే ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖద్వారం ఉంటుందని భక్తుల నమ్మకం. యాగంటిలోని నందీశ్వరుడు ప్రతి సంవత్సరం పెరిగిన రోజున కదిలి ఆలయంలోని నందీశ్వరుడూ రంకె వేస్తాడనీ, నందీశ్వరుడి చెవి నుంచి శ్వాససంబంధ ధ్వని వినిపిస్తుందనీ స్థానికులు చెబుతారు.
ఆలయానికి అభిముఖంగా సప్తరుషుల ధ్యాన మందిరం ఉంది. ఇందులో ఏడు అరలను నిర్మించారు. ఆలయ నిర్మాణ సమయంలో ఇక్కడికి వచ్చిన రుషులు ఈ అరల్లో ధ్యానం చేయడం వల్ల దీనికా పేరొచ్చింది.
అయితే ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఆ అరల్లోంచి జేగంటల ధ్వనులూ, భజనలు చేస్తున్న శబ్దాలూ వస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణం చుట్టూ రుషి గుండం, జీడి గుండాలు, ఊరే నీటి గుండాలు, అత్తాకోడళ్ల గుండాలు... ఇలా అనేక చిన్న చిన్న నీటి గుండాలు ఉన్నాయి. వీటిలో రుషి గుండం ప్రధానమైంది. అన్ని కాలాల్లోనూ నీటి మట్టం ఒకేలా ఉండటం దీని ప్రత్యేకత.
నిర్మల్-భైంసా రోడ్డు మార్గంలో దిలావర్‌పూర్ నుంచి మాడేగాం ఘాట్‌రోడ్డుమీదుగా ఏడు కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ప్రయివేటు వాహనాలు అనేకం అందుబాటులో ఉంటాయి. సారంగాపూర్ మండలంలోని అటవీప్రాంతం మీదుగా కూడా ఈ క్షేత్రానికి వెళ్లొచ్చు.