header

Kalva Lakshmi Narasima Swamy… కాల్వ లక్ష్మీనరసింహస్వామి

Kalva Lakshmi Narasima Swamy… కాల్వ లక్ష్మీనరసింహస్వామి

కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దట్టమైన అటవీప్రాంతంలో ఉంది. ఈ ఆలయాన్ని కాకతీయులు కట్టించారు. శివకేశవులకు భేదం లేదని చాటుతూ మహాశివరాత్రి రోజున లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలూ అభిషేకాలూ ఇక్కడ జరుగుతాయి. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో కొలువైన కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అత్యంత పురాతనమైంది

స్థల పురాణం

13వ శతాబ్దంలో కాకతీయ రాజులు కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గర్భాలయంలోని నరసింహస్వామిని దర్శించిన అనంతరం భక్తులు కొండమీదకు వెళ్లి పూజలు చేస్తారు.
ఔరంగజేబు ఈ ప్రాంతంమీద దాడిచేసినప్పుడు ఆలయంలోని విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంతో 1985వ సంవత్సరం వరకూ గర్భాలయంలో స్వామివారి పాదుకలు మాత్రమే ఉండేవని స్థానికుల కథనం. తర్వాత కాలంలో మూలవిరాట్టు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఆయా తేదీల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరుపుతారు.
ఆలయం ముందుభాగంలోని కోనేరులో అన్ని కాలాల్లో నీరు ఉండటం విశేషం. అంతేకాదు ఆ కోనేటి నీటిని తీసుకెళ్లి పంటపొలాల్లో చల్లుకుంటే చీడపీడలు సోకకుండా పంటలు బాగా పండుతాయనిస్థానికుల విశ్వాసం. ఏ పంటవేయాలన్నా ముందుగా ఈ కోనేటి నీటిని తీసుకెళ్లి పొలంలో చల్లడం ఇక్కడి ప్రజల అలవాటు.
ఏటా వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నరసింహుడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వారం రోజులు సాగే ఈ ఉత్సవాల్లో అఖండ దీపార్చన, అంకురార్పణ, ధ్వజారోహణం, స్వామివారి కల్యాణం, రథోత్సవం, చక్రస్నానం మొదలైన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరుపుతారు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం కోసం వచ్చే భక్తులు స్వామివారి గరుడ ముద్దలను ప్రసాదంగా అందించే సందర్భం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన దంపతులకు తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీనికోసం దూర ప్రాంతాల నుంచీ కూడా భక్తులు ఇక్కడికి వస్తారు.
మహాశివరాత్రి రోజున శివాలయాలు భక్తులతో రద్దీగా దర్శనమిస్తాయి. కానీ, విష్ణుమూర్తి అంశగా పూజలందుకునే కాల్వ నరసింహస్వామి ఆలయంలోనూ శివరాత్రిరోజున ప్రత్యేక పూజలు జరగుతాయి. భక్తులు ఈ ఆలయంలోనే జాగరణ చేస్తారు.

ఎలా వెళ్లాలి...?

నిర్మల్‌ పట్టణానికి పదకొండు కిలోమీటర్లు దూరంలో ఉన్న కాల్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. తెలంగాణాలోని అన్ని ప్రధాన బస్‌స్టాండ్‌ల నుంచి నిర్మల్‌కి బస్సు సదుపాయం ఉంది. నిర్మల్‌ నుంచి భైంసాకు వెళ్లే దారిలో సిర్గాపూర్‌, కొత్తలోలం గ్రామాల మీదుగా ప్రయాణించి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. స్వామివారి బ్రహ్మోత్సవాలూ, కల్యాణం మొదలైన పర్వదినాల్లో నిర్మల్‌ నుంచి ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. రైలు మార్గంలో వచ్చేవారు ఆదిలాబాద్‌, బాసర రైల్వే స్టేషన్లలో దిగి, రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి వెళ్లవచ్చు.