header

Ramalingeswaralayam….రామలింగేశ్వరాయం


పచ్చని చెట్లు, కోనేరు కాలుష్యం లేని ప్రకృతి సౌందర్యంతో ఉట్టిపడే వాతావరణంలో ఉన్నది ఈ రామలింగేశ్వరాలయం కృతయుగం నాటిది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడంటారు. శ్రీరాముని తండ్రి దశరథుడు గొప్ప శివభక్తుడు. ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి శివారాధనకోసం ఎక్కడ వెతికినా శివలింగం కనపడదు. దీనితో తానే ఓ లింగాన్ని ప్రతిష్టించి పూజించాడంటారు. ఆ లింగమే రామలింగేశ్వరుడుగా పేరుపొందినది.
రామేశ్వరాలయం సమీపంలో రాళ్ల మీదున్న పాదముద్రలన్నీ శ్రీరామచంద్రుడివేనని భక్తుల విశ్వాసం. రామేశ్వరాలయం ఆగ్నేయంగా రెండు కోనేర్లు ఉన్నాయి, దగ్గరలోని గుట్టలో ఉన్న మునిపుట్టలు, నాగలోకం, నవనాథుల ఆలయాలు కూడా సందర్శనీయాలే.
పూర్వం ఈ పరిసర ప్రాంతాలో ముగ్గురు మహర్షులు శివుణ్ణి గురించి ఘోరతపస్సు చేసినపుడు వారి చుట్టూ ఏర్పడిన పుట్టలే మునిపుట్టలుగా స్థానికులు పిలుస్తారు. రామేశ్వరాలయం సమీపంలోని మరో గుట్టమీద నవనాథుల దర్శనమిస్తారు. ఈ ప్రాంతం పిట్లాం గ్రామ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ రెండు బండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలో నవనాథులు అనబడే సిద్ధులు కొలువై ఉన్నారు.
రామలింగేశ్వరాలయం పునర్నిర్మాణం (2014) పనులు పూర్తి చేసుకొని ఈ క్షేత్రం మరింత శోభనీయంగా మారింది. ఇంతటి ప్రముఖ క్షేత్రానికి పెద్దగా ప్రాచుర్వం లేదు.
ఎలా వెళ్ళాలి : ఈ ఆలయం నిజామాబాద్‌ జిల్లా పిట్లాం గ్రామంలో ఉన్నది. హైదరాబాద్‌కు 150 కి.మీ దూరంలో ఉంది. సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా రోడ్డు నుంచి కిలోమీటరు లోపలికి వెళ్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. నిజాంసాగర్‌ కూడా ఈ ప్రాంతానికి ఎనిమిది కి.మీ. దూరంలో ఉంది.