header

Odela Mallikharjuna Swamy Temple / తెలంగాణ శ్రీశైలం... ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం

Odela Mallikharjuna Swamy Temple / తెలంగాణ శ్రీశైలం... ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం

అక్కడ కొలువైన శివయ్య భక్తవత్సలుడు. తనకు గాయం చేసిన భక్తుడికి సైతం మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా అతడి పేరును పక్కన చేర్చుకుని ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. శ్రీశైలం మాదిరిగానే లింగరూపం, పానపట్టం ఉండటంతో తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న శైవక్షేత్రమే పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం
దిక్కులనే అంబరాలుగా కలిగిన ఆ దేవదేవుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలుగొందుతున్న క్షేత్రం ఓదెల. పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ మల్లికార్జునుడు స్వయంభూగా వెలిశాడనీ, ఆర్తిగా మల్లన్నా అని పిలిస్తేచాలు నేనున్నానంటూ అభయమిస్తాడనీ భక్తుల నమ్మకం. అందుకే, ఓదెల మల్లన్నను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ బారులుతీరుతారు.
స్థలపురాణం
పూర్వం ఓదెల ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేదనీ, అక్కడే వెలసిన శివలింగాన్ని పంకజ మహాముని పూజించేవాడనీ ఆలయ స్తంభంపై చెక్కిన మునీశ్వరుడి రూపం, పేర్లూ తెలియజేస్తున్నాయి. కాలక్రమేణా ఈ శివలింగంపై పుట్ట పెరిగి, లింగం పూర్తిగా కనుమరుగైపోయింది. అదే స్థలంలో చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం కోసం పుట్టను దున్నుతుండగా నాగలి పుట్టలోపలున్న లింగాన్ని బలంగా తాకింది. అంతే, భయంకరంగా ఓంకార నాదం చేస్తున్న అశరీరవాణి ‘ఓదెలా! ఇకపై ఈ వంశం నశించుగాక’ అని శపించింది. జరిగిన పొరపాటును గ్రహించిన ఓదెలు వెంటనే స్వామివారికి నమస్కరించి, తాను తెలియక చేశాననీ, తనని మన్నించమనీ ప్రాధేయపడ్డాడు. అతడి నిజాయతీనీ, పశ్చాత్తాప బుద్ధినీ మెచ్చిన శంకరుడు ఓదెలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా ఓదెల మల్లికార్జున స్వామిగా ఈ ప్రాంతంలోనే కొలువై భక్తుల కష్టాలను తీరుస్తానని అభయమిచ్చాడు. అప్పటి నుంచీ ఈ ఆలయం ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంగా విరాజిల్లుతోంది. ఇప్పటికీ ఇక్కడున్న శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ కనిపించడం విశేషం.
కాకతీయుల కాలంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. స్వామి వారికి ఉత్తరంగా భ్రమరాంబ అమ్మవారినీ, క్షేత్రపాలకుడిగా వీరభద్రస్వామినీ ప్రతిష్ఠించారు. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం శ్రీశైల పండితారాధ్య పీఠానికి సంబంధించిన అర్చకులతోనే స్వామి వారికి నిత్యకైంకర్యాలు జరుపుతున్నారు. ఆలయానికి పశ్చిమ దిశలో వీరశైవ మఠం కూడా ఉంది.
అపరభక్తులైన కొండవీటి వంశంలో మల్లన్న ఖండేశ్వరుడిగా అవతరించాడు. బలిజ వంశానికి చెందిన మెడలాదేవి, యాదవ కులానికి చెందిన కేతమ్మలనే కన్యలు ఖండేశ్వరస్వామిని భక్తితో సేవించి ఆయనలో లీనమయ్యారు. ఇందుకు తార్కాణంగానే ఆలయానికి ఈశాన్యదిశలో ఖండేశ్వర స్వామి, మేడలాదేవి, కేతమ్మల విగ్రహాలు ప్రతిష్ఠించారనీ పండితులు చెబుతున్నారు. సీతారాములు నడయాడిన ప్రదేశం
ఈ ఆలయంలో మరో విశేషమూ ఉంది. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి ఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే మార్గంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకు ప్రతీకగా స్వామివారికి దక్షిణ దిశగా శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలను ఏర్పాటుచేశారని భక్తుల విశ్వాసం. ఆలయానికి తూర్పు దిశగా బంగారు పోచమ్మ, వాయవ్య దిశగా మదన పోచమ్మ ఆలయాలూ ఉన్నాయి.
ఆరాధనలూ అభిషేకాలూ
ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి- భ్రమరాంబ దేవిల కల్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరుగుతుంది. కార్తీక, శ్రావణ మాసాల్లో జరిపే ప్రత్యేక పూజలూ, మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే మహారుద్రాభిషేకాలూ విశిష్టతను సంతరించుకుంటాయి. ఈ పూజల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచీ పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఒగ్గు పూజారులు వేసే పెద్ద పట్నాలు, అగ్నిగుండాల ప్రదక్షిణ, దక్షయాగాది కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచే మేలుకొలుపు సేవ, సుప్రభాత సేవలు ప్రారంభమవుతాయి. మంగళవాద్యాల నడుమ నిత్యాభిషేకాలూ, అన్నపూజలూ, మహా నివేదనలూ ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగే ప్రదోషకాల పూజలూ, హారతీ, ద్వార బంధన కార్యక్రమాలు విశిష్టమైనవి. పట్నాలు, బోనాల మొక్కులు సమర్పించే భక్తులతో ఈ ఆలయంలో ఎప్పుడూ పండగవాతావరణం నెలకొంటుంది.
ఇలా వెళ్లాలి...
కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది. రైలూ రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్‌ బస్సు డిపో నుంచి పెద్దపల్లి చేరుకునే ప్రతి బస్సూ ఓదెల మీదుగానే వెళ్తుంది. వరంగల్‌ జిల్లా నుంచి 60 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు.
- ఎం.గణేశ్‌ కుమార్‌ సౌజన్యంతో..., ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి