header

లక్ష్మీనరసింహ స్వామి .... నాంపల్లి గుట్ట... /Lakshminarasimha Swamy, Nampalli Gutta

లక్ష్మీనరసింహ స్వామి .... నాంపల్లి గుట్ట... /Lakshminarasimha Swamy, Nampalli Gutta

లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో ఎంతో విశిష్టత ఉన్న పుణ్యక్షేత్రం నాంపల్లి గుట్ట...
గుట్ట దిగువన పడగ విప్పిన సర్పాకారంలో పెద్దగా నిర్మించిన నాగదేవత ఆలయం అద్భుతాన్ని కళ్లకు కడుతోంది. ఆధ్యాత్మిక పర్యటక క్షేత్రం కూడా. చుట్టూ పచ్చని చెట్లూ కనుచూపుమేర పంట పొలాలూ ఓ వైపు మూలవాగు, మరో వైపు మానేరు వాగు... ఆ ప్రకృతి అందాలమధ్య ఎత్తైన గుట్టమీద లక్ష్మీసమేతంగా కొలువై ఉన్న నరసింహస్వామివారి ఆలయం ఎంతో పురాతనమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ- కరీంనగర్‌ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న నాంపల్లి గుట్టను పూర్వం నామపల్లిగా పిలిచేవారు. 600 సంవత్సరాల క్రితమే ఈ గుట్టపైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వెలసినట్లు చెబుతుంటారు. చోళుల కాలంలో ఇక్కడి స్వామి వారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి.
క్రీ.శ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుడు వేములవాడ ప్రాంతాన్ని దర్శించి ఇక్కడి కోనేటికి మెట్లు కట్టించాడని చెబుతుంటారు. ఆయన భార్య రత్నాంగిదేవి ఈ గుట్టపైనే తపస్సు చేసి సారంగధరుడిని కుమారుడిగా పొందిందనేది చారిత్రక కథనం. ఈ కారణంతోనే పెళ్లైన కొత్త జంటలు సంతానం కల్గితే ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే, నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామిని సంతాన నర్సింహుడనీ పిలుస్తారు.
సంతానం కల్గిన దంపతులు, కోర్కెలు తీరిన భక్తులూ ఆలయం తూర్పు వైపున ఉన్న రావి చెట్టుకు ముడుపులు కట్టి వెళ్తుంటారు. ఈ ఆలయానికున్న మరో విశిష్టత లోపల ఉన్న అంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి 41 రోజులు మండల దీక్ష పడితే కష్టాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. గుట్టపైన కొండ చరియల మధ్య సహజ సిద్ధమైన రెండు కోనేరులున్నాయి. ఇక, ఆలయానికి పక్కనే ఉన్న చిన్న గుహలో శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతాయి.
క్రీ.శ 9, 10 శతాబ్దాల్లో నవనాథ సిద్ధులు(తొమ్మిదిమంది) ఈ గుట్టమీద తపస్సు చేసి సిద్ధి పొందారట. వారు నిత్యం ఈ గుహ నుంచి భూగర్భ సొరంగం ద్వారా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చేవారట. ఏటా నాంపల్లిగుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం, శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, మహాశివరాత్రి వేడుకలు, శ్రావణమాసం ప్రత్యేక పూజలు, శ్రీరామనవమి, గోదారంగనాథుల కల్యాణం తదితర వేడుకలను నిర్వహిస్తుంటారు. నాంపల్లి గుట్ట పర్యటకులకు అంత ఆహ్లాదాన్ని పంచుతుంది. ప్రకృతి అందాలతో పాటు, ఇక్కడున్న మరో ప్రత్యేక ఆకర్షణ కాళీయమర్దనం. ఇది ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌ అయిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి గుట్ట దిగువ భాగంలో దీన్ని నిర్మించారు. గుట్టపైనుంచీ దూరం నుంచీ చూస్తుంటే చెట్ల మధ్యన చుట్టుకున్న కొండంత పాములా కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకత.
దీని లోపలికి వెళ్లే మార్గంలో లక్ష్మీ నరసింహ స్వామి లీలల్ని వివరించేలా రకరకాల శిల్పాలను ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ చూస్తూ చివరగా నాగదేవతను దర్శించుకోవచ్చు. ఇది పర్యాటకులనూ భక్తులనూ ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాంపల్లి గుట్ట ఆలయాన్ని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం అధికారులు 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకొని దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.. ప్రధాన రోడ్డు నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా గుట్టపై వరకు అన్ని వాహనాలూ వెళ్లడానికి రోడ్డుసౌకర్యం ఉంది. అక్కడి నుంచి మెట్లెక్కి, గుట్టపై ఉన్న స్వామిని దర్శించుకోవచ్చు.
ఎలా వెళ్లాలి ?
కరీంనగర్ లోని వేములవాడ బస్ స్టాండ్ నుండి 5 కీ.మీ. దూరంలో నాంపల్లి గుట్ట ఉంది.