సిరిసిల్లకు పూర్వపు పేరు శ్రీశాల. కాలక్రమంలో సిరిసిల్లగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం అతిపురాతనమైనది. తిరుమల తిరుపతి క్షేత్రం లాగే సిరిసిల్లోనూ స్వామివారి బ్రహ్మోత్సవాలు, మాడ వీధుల్లో ఊరేగింపులు జరుగుతాయి. 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీశాల వెంకన్న సిరుల వేల్పుగా, కోర్కెలు తీర్చే స్వామిగా భాసిల్లుతున్నాడు. ఈ నెల 27 నుంచి అక్టోబరు 7 వరకు సిరిసిల్ల వెంకన్న సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా...
ఎనిమిది వందల ఏళ్ల కిందట మానేరు నదీతీరమంతా దట్టమైన అరణ్యంతో, నదీప్రవాహంతో ఎంతో ఆహ్లాదంగా ఉండేది. నది ఒడ్డున మాండవ్య మహాముని ఆశ్రమం ఉండేది. ఆయన ఈ నదీ తీరంలో మహాయాగం చేయాలని సంకల్పించి, విష్ణుమూర్తిని గురించి ఘోరతపస్సు చేసి, స్వామిని ప్రత్యక్షం చేసుకుని, ఆయన ఆశీరనుగ్రహంతో ఇక్కడ మహాయాగం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, ఆయన పాదస్పర్శతో పవిత్రమైన ఈ నేలపై కొంతకాలానికి శ్రీశాల పేరుతో ఊరు నిర్మాణం జరిగింది. జమీందారులు, దేశాయిలు శ్రీవారి అనుగ్రహంతో ఇక్కడ శ్రీకేశవనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు.
200 ఏళ్ల తరువాత 1826 ప్రాంతంలో మొగలాయిలు కాకతీయుల రాజ్యంపై దండెత్తి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ శ్రీశాల కేశవనాథస్వామి వారి విగ్రహాలను పగులగొట్టారు. భిన్నమైన విగ్రహాలు ఇప్పటికీ ఆలయంలో ఉన్నాయి. సిరిసిల్ల సర్దేశాయిలు చెన్నమనేని తుక్కారావు, మీనారావులు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి సిరిసిల్ల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే వేల్పుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.
సిరిసిల్ల శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏటా తిరుమల తిరుపతి తరహాలోనే బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవం, రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆశ్వీయుజ శుద్ధ సప్తమి నుంచి ఆశ్వీయుజ బహుళ విదియ వరకు వేడుకలు నిర్వహిస్తారు. స్వామివారిని శేషవాహనం, హంసవాహనం, సింహ వాహనం, అశ్వవాహనం, గరుడ వాహనం, హన్మంత వాహనం, సూర్య వాహనం, గజవాహనం, పొన్నవాహనం, చంద్రవాహనాలపై ఆలయ వీధుల్లో ఊరేగిస్తారు. రంగనాయక తిరుప్పోలం, ఆండాలమ్మ వారికి ఒడిబియ్యం సమర్పిస్తారు. వేదమంత్రోచ్చరణల మధ్య శ్రీలక్ష్మీ, అలివేలు మంగమ్మ సమేతంగా స్వామి వారి ఊరేగింపులు సాగుతాయి. పురాతన విగ్రహాలు, భారీ రథం ఇక్కడి ప్రత్యేకతలు.
శ్రీశాల వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద విజయదశమి రోజు హోమం నిర్వహిస్తారు. స్వామివారు మానేరు తీరంలోని రాంలీలా మైదానానికి జంబిగద్దెకు వస్తారు. రావణదహనం కావించి వెళతారు. సిరిసిల్ల పట్టణ నడిబొడ్డున అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. భక్తులు తాళ్లతో రథాన్ని లాగుతూ ఆలయ వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. రథోత్సవ రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. సిరిసిల్లలో జరిగే పెద్ద వేడుక ఇదే. మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, నాకబలి, పుష్పయాగం, దేవతీ ఉద్వాసన, గ్రామబలి, ఏకాంత సేవతో వేడుకలు ముగుస్తాయి.
స్వామి సన్నిధిలో నిత్యపూజలు జరుగుతాయి. రోజూ భక్తులతో ఆలయం సందడిగా ఉంటుంది. రాష్ట్ర దేవాదాయశాఖ అధీనంలోని ఈ ఆలయానికి ఇనాం భూములు, స్థిరాస్తులు ఉన్నాయి. వంశపారపర్యంగా పూజారులు ఇక్కడ స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. సిరులు కురిపించే దేవుడిగా శ్రీశాల వెంకన్న ప్రతీతి.
సిరిసిల్ల పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బస్సు మార్గం ఒక్కటే ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే వారు సిద్దిపేట మీదుగా 136 కిలోమీటర్లు ప్రయాణించి సిరిసిల్ల చేరుకోవచ్చు. రైలు మార్గంలో రావాలంటే కామారెడ్డి మీదుగా 60 కిలోమీటర్లు కరీంనగర్ మార్గంలో వస్తే సిరిసిల్ల ఆలయానికి రావచ్చు. కరీంనగర్ నుంచి వచ్చే వారు 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే స్వామివారిని దర్శించుకోవచ్చు.
– వూరడి మల్లికార్జున్ సౌజన్యంతో... సాక్షి, రాజన్న సిరిసిల్ల