వికారాబాద్, అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి శేషతల్పంమీద పవళించినట్టుగా కాకుండా నిలబడిన భంగిమలో సాలగ్రామ శిలారూపంలో దర్శనమిస్తాడు.
అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ పుణ్య క్షేత్రం. విష్ణుపురాణం ప్రకారం... విష్ణుమూర్తి పాన్పు అయిన శేషుని తలభాగం తిరుమలగా, మధ్య భాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా వెలుగొందుతోంది. ఇక్కడే సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల పాటు మార్కండేయ మహర్షి తపస్సు చేసి శ్రీమహావిష్ణువు ఈ కొండల్లోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందుతాడు. సాలగ్రామ శిలగా వెలసిన ఆ శ్రీహరిని మార్కండేయుడు కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి అర్చించినట్లు స్థలపురాణం వలన తెలుస్తుంది. కలియుగ ప్రారంభ సమయంలో మార్కండేయుడు పద్మనాభ స్వామిని ఇక్కడికి వచ్చినవారందరికీ గంగా స్నాన భాగ్యం కలిగేట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామి ఆనతి మేరకు గంగాదేవే స్వయంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరిణిగా మారిందని చెబుతారు.
ఏటా అనంతగిరిలో రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చిన్న జాతరను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలూ, పల్లకీ సేవా, అనంతరం పెరుగు వసంతాన్నీ కనుల పండగగా చేస్తారు. కార్తిక మాసంలో అనంత పద్మనాభుడికి వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజుల్లో రోజుకొక వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు నిర్వహించే రథోత్సవం, చక్రస్నానాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
తెలంగాణా రాష్ట్రంలోని వికారాబాద్ పట్టణంలోని అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. హైదరాబాద్‌కి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. హైదరాబాద్ లోని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి తాండూరు వెళ్లే బస్‌లో వికారాబాద్ వరకూ వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయానికి వెళ్లవచ్చు. సికింద్రాబాద్ నుండి రైల్లో వికారాబాద్ వెళ్లి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.