header

Sri Rangapuram Temple….శ్రీరంగాపురం ఆలయం..వనపర్తి జిల్లా..తెలంగాణా

Sri Rangapuram Temple….శ్రీరంగాపురం ఆలయం..వనపర్తి జిల్లా..తెలంగాణా

16వ శతాబ్దంలో వనపర్తి సంస్థానాదీశుడు గోపాలరావు హయాంలో నిర్మితమైంది. తమిళనాడులోని శ్రీరంగం వెళ్లిన గోపాలరావుకు.. రంగనాథుడు కలలో కనిపించి తాను చెప్పిన చోట ఆలయాన్ని నిర్మించమన్నాడట. స్వామివారి మూలవిరాట్టు ఒక పుట్టలో లభించగా, దారి చూపడానికి వచ్చిన స్వామి వాహనం గరుడపక్షి వాలిన కొరివిపాడు గుట్ట ఇప్పుడున్న శ్రీరంగాపురంపై ఆలయం నిర్మించారని చరిత్ర.
గుడి చుట్టూ భారీ తటాకం తవ్వించారు. పక్కనే ఉన్న వాగులో నుంచి ఇందులోకి నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీంతో కావేరి నదీ తీరంలోని శ్రీరంగాన్ని మరిపిస్తుందీ ఆలయం. గుడిలోని నిలువెత్తు రాతిస్తంభాలు, అపురూప శిల్పాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. గర్భాలయంలో శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుడి దివ్యమంగళ విగ్రహం ఆధ్యాత్మిక తరంగాలను ప్రసారం చేస్తుంది. ఆదిశేషుడిపై శయనించిన రంగనాథుడి దర్శనంతో భక్తులు పులకించిపోతారు.
ఆలయ పరిసరాల్లోని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ ఉన్న పంటపొలాలు, జలాశయం మీదుగా వచ్చే చల్లని గాలి యాత్రికులను సేదతీరుస్తాయి.
ఏటా ఫాల్గుణ మాసంలో ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.. కల్యాణం, రథోత్సవానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్దఎత్తున శ్రీరంగాపురం వస్తారు.
ఎలా వెళ్లాలి...? శ్రీరంగాపురం వనపర్తి జిల్లా కేంద్రం నుంచి 24 కి.మీ., పెబ్బేరు నుంచి 10 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్లే బస్సులు పెబ్బేరు మీదుగా వెళ్తాయి. అక్కడ బస్సు దిగి ప్రైవేట్‌ వాహనాల్లో శ్రీరంగాపురం చేరుకోవచ్చు. వనపర్తి నుంచి రోడ్డు మార్గంలో శ్రీరంగాపురం వెళ్లొచ్చు.