శ్రీ జగన్నాధ వేంకటేశ్వరుడు – మహబూబాబాద్:
వరంగల్, జిల్లా, మహబూబాబాద్ మండలం అనంతారం గ్రామ శివార్లలోని గుట్టలలో వెలసిన దేవుడు స్వయంభూ జగన్నాథవేంకటేశ్వరుడు. ఈ ప్రాంతాన్నే అనంతాద్రి అనికూడా పిలుస్తారు.
క్రీ.శ. 13వ శతాబ్ధంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. అనంతారం గ్రామ పెద్దకు కలలో జగన్నాథస్వామి కనబడి అనంతుడనే మహర్షి తపోఫలం చేత పూరీ జగన్నాధ క్షేత్రం నుండి తాను సుభద్ర, బలభ్రద సమేతంగా ఇక్కడకు వచ్చానని, ఇక్కడే వెలసానని మరియు ఇరువురు దేవేరులతో వేంకటేశ్వరస్వామి గుట్ట పడమటి కనుమలలో వెలసినట్లు చెబుతాడు. గ్రామ పెద్ద గ్రామస్తుల సహాయంతో గాలించగా కీకారణ్యంలో ఓ గుహలో భద్ర బలభ్రద సమేతంగా జగన్నాథస్వామి దర్శనమిచ్చాడు. కాసేపటికే శ్రీదేవి-భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కనిపించాడు. గ్రామస్తుల సంతోషానికి అవధులు లేవు. గుట్టమీదకు మెట్లదారి నిర్మించి గుడి కట్టారు.
ఇంకో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో మహావిష్ణు భక్తుడైన అనంతుడనే మహర్షి ఉండేవాడు. అతని తపస్సు ఫలితంగా స్వామి సుభద్ర, బలభద్ర సమేతుడై జగన్నాథ స్వామిగా దర్శనమిచ్చి నిత్యం ఈ క్షేత్రానికి వచ్చేవాడు. కొంతకాలానికి ఈ విషయం చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి తెలిసి కొత్తదంపతులు పసుపు బట్టలతో వచ్చి కొంగుముడి బంగారాన్ని స్వామివారికి కానుకగా ఓ చెక్కపెట్టెలో వేసి వెళ్లేవారు. ఓక రోజు చీకటిలో దొంగలు ఆ బంగారాన్ని దోచుకోవటానికి వచ్చి గుట్ట మీద ఉన్న స్వామి వారిని సామాన్యుడుగా భావించి వెనుకనుండి స్వామి మీద దాడి చేస్తారు. స్వామి వారికి గాయాలయ్యాయి. సుభధ్ర, బలభ్రదునితో పాటు స్వామి శిలారూపం ధరిస్తారు. దొంగలు బండరాళ్ళుగా మారతారు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి.
కాలక్రమంలో ఆలయం శిధిలావస్థకు చేరుకోగా, మూడు దశాభ్దాల క్రితం మళ్ళీ వెలుగులోకి రావటంతో నిత్యపూజలతో పాటు కళ్యాణమండపం కూడా ఏర్పాటు చేశారు. ఈ మండపాన్నే ప్రస్తుతం యాగశాలగా ఉపయోగిస్తున్నారు.
2006 సంవత్సరంలో సుమారు కోటి రూపాయలతో ఆలయాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దారు. మూడువైపులా రహదారులు ఏర్పరచి, స్వాగతతోరణాలు కట్టారు. ఆలయానికి తూర్పువైపు గరుడాళ్వార్ విగ్రహం, ఉత్తదిశలో ఆంజనేయస్వామి విగ్రహం నెలకొల్పారు. పుష్కరిణి, గాలిగోపురం, కళ్వాణమండపం, సమీపంలో కట్టమైసమ్మ గుడి కట్టారు. పూలతోటలు ఏర్పాటు చేసి పిల్లలకోసం ఆటవస్తువులను ఏర్పాటు చేసారు. గుట్టపైనుండి జలపాతాన్ని ఏర్పాటు చేశారు.
ఎలావెళ్ళాలి ?: జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వరంగల్ జిల్లా, మహబూబా బాద్ మండలంలోని అనంతారం గ్రామంలో ఉన్నది. విజయవాడ-హైదరాబాద్ రైలు మార్గంలో మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో దిగి అక్కడనుండి 2 కి.మీ. దూరంలో ఉన్న అనంతారం గ్రామానికి వెళ్ళవచ్చు.