దట్టమైన అరణ్యప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం..... మధ్యలో ఆర్ధచంద్రాకారంలో ఉండే ఎత్తైన కొండపై వెలసిన లక్ష్మీనారసింహుడు. మరో యాదగిరి గుట్టగా పిలిచే ఈ క్షేత్రమే హేమాచల నారసింహక్షేత్రం.
స్థలచరిత్ర : రామాయణ కాలంలో సీతాపహరణం జరిగిన తరువాత శ్రీరాముడు మహర్షుల సలహా మేరకు ఈ ప్రాంతంలో లక్ష్మీనరసింహుణ్ణి దర్శించుకున్నాడట. స్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.
ఒకసారి భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలో పర్వటిస్తుండగా లక్ష్మీనరసింహస్వామి భరధ్యాజునికి కలలో కన్పించి తాను హేమాద్రి గుట్టపై గుహలో ఉన్ననని చెప్పాడట. భరధ్యాజుడు తన శిష్యులతో తవ్వకాలు జరిపిస్తుండగా స్వామి విగ్రహానికి నాభి ప్రాంతంలో దెబ్బ తగిలిందట. అప్పుడు లక్ష్మీనరసింహడు ఊగ్రరూపంతో దర్శనమివ్వగా భరద్వాజుడు స్వామిని ప్రార్ధించి శాంతింపచేస్తాడు. స్వామి నిలువెత్తు రూపం గోడపై ప్రత్యక్షమౌతుంది. స్వామి నాభి ప్రాంతం నుంచి రక్తం వస్తుంటే పసుపుతో కట్టుకట్టారట. కానీ, రక్తస్రావం మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ స్వామి నాభిభాగం నుండి ఒకరకమైన స్రావం వస్తూనే ఉంటుంది. దానిని ఆపటానికి స్వామివారికి నేటికి చందనం పెడతారు.
సంతానం లేనివారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, కుజదోషం ఉన్నవారు, రాహుకేతు దోషం ఉన్నవారు ఈ చందనాన్ని సేవిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని మరో విశేషం స్వామి వారి ఎడమపాదం నుండి నిత్యం జలం వస్తుంది. ఈ నీరు గుట్టకింద గోముఖాన్ని పోలిన ప్రతిమ నుంచి బయటకు పోతుంది.
చింతామణి సెలయేరు : శాతవాహనుల కాలం తరువాత కాకతీయుల కాలంలో రుద్రమదేవి పరిపానలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందినది. ఒకసారి రుద్రమదేవి హేమాచల ప్రాంతంలో పర్వటిస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. లక్ష్మీనరసింహస్వామి పాదాల నుండి వస్తున్న సెలయేరులో స్నానంచేస్తే రోగం నయమవుతుందని అదృశ్వవాణి చెప్పిందంటారు. రుద్రమదేవి సేలయేటి నీరును తాగి, అందులో స్నానం చేసిన తరువాత ఆరోగ్యం కుదుటపడుతుంది.
ఇంతటి మహిమాన్వితమైన జలధార వృధాగా పోకూడదని రుద్రమదేవి అక్కడ కోనేటిని తవ్వించి, స్వామికి చింతామణి హారాన్ని సమర్పించుకుంటుంది. అప్పటి నుండి ఈ కోనేటికి చింతామణి సెలయేరు అని పేరు వచ్చిందంటారు. ఈ దేవాలయానికి దగ్గరలో ఉన్న గ్రామాలు తరచూ తగలబడి పోతుండటంతో శాతవాహనులు ఈ గ్రామాలను దేవాలయానికి దూరంగా తరలించారు. అప్పటి నుండి గ్రామాలు తగలబడటంలేదు. అందుకే ఇప్పటికీ ఈ దేవాలయం చుట్టుప్రక్కల 5 కి.మీ. లోపు గ్రామాలు లేవు.
ప్రతి సంవత్సరం వైశాఖశుద్ధ పౌర్ణమి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఎలావెళ్ళాలి : వరంగల్ జిల్లా మంగపేట మండంలోని మల్లూరు గ్రామానికి 5 కి.మీ. దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ముందుగా మంగపేటకు చేరుకుంటే అక్కడ నుండి ఆటోలో వెళ్ళవచ్చు. వరంగల్ నుండి మొత్తం 140 కి.మీ దూరంలో ఉంటుందీ దేవాలయం. వరంగల్‌కు రైలు మార్గం ద్వారా వెళ్ళవచ్చు.(విజయవాడ-హైద్రాబాద్, హైద్రాబాద్ -విజయవాడ వయా వరంగల్ రైలు మార్గం)