header

Inavolu Mallanna Temple… ఐనవోలు మల్లన్న ఆలయం

Inavolu Mallanna Temple… ఐనవోలు మల్లన్న ఆలయం
ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న క్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయం. ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి రూపం ఎంతో అపురూపం. కాకతీయుల శిల్పకళాచాతుర్యం నుంచి స్వామికి జరిగే ఉత్సవాలవరకూ ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. వరంగల్‌ నగరానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామి మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేల్‌ రాయుడు అనే నామాలతోపూజలందుకుంటున్నాడు.
స్థలపురాణం
వరంగల్‌ జిల్లా ఐనవోలు గ్రామంలో ఉన్న ఈ క్షేత్రాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఓరుగల్లు రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయులు ఐనవోలు గ్రామంలో శిలలతో అబ్బురపరిచేలా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆయుధాలు భద్రపరిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇక ఆలయ విషయానికి వస్తే, పదడుగుల ఎత్తులో దేవేరుల సమేతంగా కొలువుదీరిన మల్లన్న రూపం, ఆలయప్రాంగణంలోని అష్టోత్తర స్తంభాలూ, విశాల మండపాలూ, రాతి ప్రాకారాలూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. కాకతీయుల పరిపాలనలో అయ్యన్నదేవుడు మంత్రిగా ఉన్న కాలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. ఈ ఊరికి ఐనవోలు అనే పేరు రావడం వెనక అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అయ్యన్నదేవుడి పేరుమీదుగానే ఈ ఊరుకి అయ్యన్నవోలు అనే పేరువచ్చిందనీ అది కాలక్రమేణా అయినవోలు... ఐనవోలుగా మార్పు చెందిందనీ చెబుతారు. క్రీ.శ. 1369 కాలంలో ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించిన అనపోతనాయుడు అనే రాజు కూడా ఐనవోలు మల్లికార్జునస్వామిని పూజించి అనేక యుద్ధాల్లో విజయం సాధించాడనీ, ఈ స్వామిని సేవిస్తే కోర్కెలు నెరవేరతాయనీ తరతరాలుగా భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవం
సంక్రాంతి పర్వదినం మొదలుకొని ఉగాది వరకూ మూడు నెలలపాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచీ పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఏ శుభకార్యం జరగాలన్నా ముందు ఐనవోలు మల్లన్నకు మొక్కులు ముట్టజెప్పాలన్నది ఇక్కడి ప్రజల ఆనవాయితీ. జానపదుల జాతరగా పేరుపొందిన ఐనవోలు జాతరలో భక్తులు ‘కోర్కెలు తీరితే కోడెను కడతాం... పంటలు పండితే పట్నాలు వేస్తాం...’ అంటూ భక్తితో బోనాలు వండి, వాటిని అందంగా ముస్తాబు చేసి స్వామివారికి సమర్పిస్తారు. సంతానం లేని మహిళలు బోనాలు సమర్పించి టెంకాయతో ముడుపు కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో వేసే పెద్దపట్నం, శివకల్యాణం, అయిదు రోజులపాటు సాగే అశ్వ, నంది, పర్వత, రావణ వాహన సేవలూ, చివరి రోజు రథోత్సవాలనూ ఈ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తారు.
ఐనవోలు జాతర
సంక్రాంతి రోజు ప్రారంభమయ్యే ఐనవోలు జాతరలో పెద్దబండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాకతీయుల కాలం నుంచీ ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరించేవారు. తర్వాత 1969 సంవత్సరంలో మార్నేని వంశస్థులు ఈ దేవాలయాన్ని స్వచ్ఛందంగా దేవాదాయశాఖకు అప్పగించారు. అప్పటి నుంచీ ప్రభుత్వమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. మకర సంక్రాంతి రోజు పెద్దబండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి, ఉత్సవాలను ప్రారంభించడం పరిపాటి. ఏటా సంక్రాంతి రోజున తిరిగే పెద్దబండిని చూడటానికి వేలసంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు.
ఎలా వెళ్లాలి....?...
మల్లన్నను దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచీ వరంగల్‌కు బస్సు మరియు రైలు మార్గాల సదుపాయం ఉంది. అక్కడి నుంచి ఐనవోలుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో దిగి, రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.