5 ఎకరాల స్థలం ఈ గుడి నిర్మించబడినది. మరియు చుట్టుప్రక్కల ఇంకా 20 ఎకరాల స్థలంలో పచ్చదనం అభివృద్ధిచేయబడినది. నక్షత్రాకార కట్టడం మీద ఉన్న ఈ శివాలయం 12, 13వ శతాబ్దాలకు చెందినది. ఈ దేవాలయం చెక్కిన ప్రధానశిల్పి రామప్ప. ఇతని పేరుతోనే ఈ దేవాలయం వ్వవహరించబడటం విశేషం. తూర్పుదిశగా ఎత్తైన వేదిక మీద గర్భాలయం, అంతర్భాగంలో మూడువైపుల ప్రవేశద్వారాలు గల మహామండపం కలిగియున్నది. ఈ దేవాలయం తేలికైన ఇటుకలతో నిర్మించబడినది. ఈ ఇటుకలు నీటిపై తేలతాయని చెబుతారు. ఈ దేవాలయం గోడమీద రామాయణ, మహాభారత గాథలు చెక్కబడి ఉన్నవి. పైకప్పు క్రింది భాగాన నల్లని నునుపు రాతిపై చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల కళాభిరుచికి తార్కారణం. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థం బాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలను చూడవచ్చు. ఇక్కడ జరుగు ముఖ్యమైన పండుగ శివరాత్రి.
ఈ దేవాలయం ముస్లిం దండయాత్ర వలన, ప్రకృతి వైపరీత్యా వలన, 17వ శతాబ్ధంలో వచ్చిన భూకంపం వలన కొంత భాగం దెబ్బతిన్నది. అయినను దేవాలయంలో స్వామి ఎదురుగా తొమ్మిది అడుగుల ఎత్తున్న ఉన్న నంది విగ్రహం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు కూర్చున్న భంగిమలో ఉన్నది. ఈ దేవాలయంను చూడటానికి మనదేశం నుండియే గాక విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తారు.
ఈ ఆలయం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని పరిపాలనలో అతని సైన్యాధిపతి రేచర్ల రుద్రయ్యచే నిర్మించబడినది. ఇక్కడికి దగ్గరలో ఉన్న పాకాల చెరువు కాకతీయ రాజులచే త్రవ్వించబడినది. ఇప్పటికీ కొన్నివేల ఎకరాకు సాగునీరు అందించుచున్నది.
ఎలా వెళ్ళాలి : విజయవాడ-హైదరాబాద్ రైలు మార్గంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుండి బస్సులో రామప్ప గుడికి వెళ్ళవచ్చు.