header

Shambu Lingeswara Swamy…..Warangal…శంభులింగేశ్వరస్వామి క్షేత్రం

Shambu Lingeswara Swamy…..Warangal…శంభులింగేశ్వరస్వామి క్షేత్రం

భక్తుల పాలిట కొంగుబంగారం ప్రాచీనమైన ఖిలా వరంగల్‌లోని కోటలో వెలసిన స్వయంభూ శంభులింగేశ్వరస్వామి క్షేత్రం. అంతే కాదు కాకతీయుల ఆరాధ్య దైవం కూడా. పురాతన క్షేత్రాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దక్షిణ ముఖంగా దర్శనమిచ్చే నందీశ్వరుడి చెవిలో కోరికను చెబితే అది పరమేశ్వరునికి చేరుతుందని భక్తుల నమ్మకం. భక్తులు శంభులింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం నందీశ్వరుడి చెవిలో తమ కోర్కెలు విన్నవిస్తారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి మొక్కులు చెల్లిస్తారు. స్థల పురాణం....
హన్మకొండ రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయ రాజులు అప్పట్లో అరణ్యంగా ఉన్న ఖిలా వరంగల్‌ ప్రాంతానికి వేటకు వచ్చారు. మార్గమధ్యంలో వారి రథం భూమిలో కూరుకుపోయింది. రథచక్రాన్ని బయటికి తీయాలని ఎంత ప్రయత్నించినా రాలేదు. అలసిన రాజులు అక్కడే సేదతీరారు. ఆ రాత్రి స్వప్నంలో పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. రథచక్రం కూరుకుపోయిన ప్రాంతంలో తన ఆలయం ఉందని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ వెంటనే మేల్కొన్నవారికి భూమిలో కూరుకుపోయిన ఇనుప రథచక్రం కాస్తా బంగారంగా మారి కనిపించింది. వెంటనే అక్కడ తవ్వకాలు చేపట్టగా పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎవరూ ప్రతిష్ఠించకుండానే వెలసిన దేవాలయంగా స్వయంభూ శంభులింగేశ్వరస్వామి క్షేత్రం ఏర్పడినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. కాకతీయులు శివుడిని తమ ఆరాధ్య దైవంగా భావించి పూజించారు.
తరువాత దేవస్థానాన్ని క్రీ.శ.1162 సంవత్సరంలో గణపతిదేవ చక్రవర్తి అభివృద్ధి చేశాడు. భూభాగం పుష్పాకారాన్నీ, పైకప్పు నక్షత్రాకారాన్నీ పోలికలతో రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో త్రిభుజాకారంలో 40 అడుగుల ఎత్తున్న గోపురాన్ని హైందవ సంప్రదాయం ప్రకారం తేలికపాటి ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. దేవాలయ ప్రాంగణంలోనే అంతరాలయం, నాట్యమండపాలు ఏర్పాటు చేయబడ్డాయి.
ప్రత్యేకతలు......
ఈ ఆలయంలోని శివలింగం భూమికి అతి తక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రత్యేక అభిషేకాలు చేసిన అనంతరం భక్తులే స్వయంగా శివలింగానికి పూజలు చేయవచ్చు. సాధారణంగా కాకతీయులు నిర్మించిన వివిధ దేవాలయాల్లో ఉత్తర ముఖంగా నందీశ్వరుడు ఉంటాడు. కానీ, ఈ క్షేత్రంలో మాత్రం నందీశ్వరుడు దక్షిణ ముఖంగా దర్శనమిస్తాడు. దక్షిణ ద్వారం వద్ద వీరభద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఇక్కడ విశేష పూజలూ, శివపార్వతుల కల్యాణాలూ, మహా రుద్రాభిషేకాలూ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.
ప్రతి సోమవారం రుద్రాభిషేకాలూ, అర్చనలూ, ప్రత్యేక హారతులతో పూజలు జరుగుతాయి.
ఎలా వెళ్లాలి... ?
ఈ క్షేత్రానికి వెళ్లటానికి రైలు లేక బస్సులలో వెళ్లవచ్చు. రైల్వేస్టేషన్‌ సమీప రైలు కేంద్రం వరంగల్‌. అక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ఆటోలలో ప్రయాణించి ఖిలా వరంగల్‌ కోటకు చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచీ వరంగల్‌కు బస్సు సౌకర్యం ఉంది.