నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు (శివుడు లింగరూపంలో) ప్రధాన అర్చామూర్తిగా కొలువై ఉన్నాడు. ప్రధాన ఆయం తూర్పుకు అభిముఖంగా అధ్బుతమైన శిల్పకళతో చూపరులను ఆకట్టుకుంటుంది. నందీశ్వరుని విగ్రహం ప్రధానాలయానికి ఎదురుగా ఠీవిగా దర్శనమిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే పానపట్టం లేని నిలువెత్తు శివలింగం దర్శనమిస్తుంది. ఆలయం లోపల లతలు పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులను, పురాణ ఘట్టాలు చూపరులను ఆకట్టుకుంటాయి.
కళ్యాణమంటపం మరియు ప్రధానాలయాన్ని మొత్తం వేయు స్థంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయు స్థంభాల దేవాలయమనే పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం వేయు స్థంభాలు లేవు. విదేశీయులు, మహ్మదీయుల దండయాత్రలో మరియు ప్రకృతి వైపరీత్యాల వలన ఆయం కొంతవరకు దెబ్బ తిన్నది.
ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు నీడలో భక్తులు సేదతీరుతారు. ఇటీవల పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో కళ్యాణ పండపం క్రింద ఒక బావి వెలువడినది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రులో మరియు పర్వ దినాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఎలా వెళ్ళాలి : ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా హనుమకొండ నడిబొడ్డున ఉన్నది. వరంగల్ రైల్వేస్టేషన్ నుండి బస్సు ద్వారా లేదా ఆటోలలో వెళ్ళవచ్చు. స్టేషన్ నుండి 5 కి.మీ. దూరం. వరంగల్ విజయవాడ-హైదరాబాద్, (హైదరాబాద్-విజయవాడ) రైలు మార్గంలో వరంగల్ పట్టణం ఉన్నది.(విజయవాడ నుండి 241 కి.మీ. దూరం,హైదరాబాద్ నుండి 147 కి.మీ దూరం)