header

Atla Tadde… అట్లతద్దె : డా॥ మైలవరపు శ్రీనివాసరావు

Atla Tadde… అట్లతద్దె : డా॥ మైలవరపు శ్రీనివాసరావు

ఆడపిల్ల ఆనందంగా ఊయాల ఊగుతుంటే నోరంతా లక్కపిడతలా తాంబూలం వలన ఎర్రగా కన్పిస్తుంటే, కొత్తగా కుట్టించుకున్న పరికిణీ, కొత్త బంగారు కుప్పెల జడ నిలువుగా వేలాడుతుంటే, అరచేతులనిండా గోరింటాకు ఎరుపు ఇవన్నీ కలిపే చక్కని తెలుగు వారి పండుగ అట్లతద్దె. ఒకప్పటి రోజుల్లో అట్లతద్దె కుండే హడావుడీ, కోలాహం క్రమంగా కనుమరుగైపోతున్నాయి. కనీసం అట్లతద్దెలోని మర్మమేమిటో తెలుసుకుందాం ! .
అట్లతద్దె ఆశ్వయుజమాసం (సాధారణంగా అక్టోబర్‌లో) పూర్ణిమ దాటిన 3వ రోజున వస్తుంది.ఈ రోజున త్లెవారుజామున కన్నెపిల్లలంతా బాగా విశాలమైన ప్రాంగణమున్న ఇంటికి చేరతారు. ఎవరి చేతికి గోరింటాకు బాగా పండిందో ఒకరి అరచేతినొకరు చూపించుకుని మురిసిపోతారు.
అక్కడవున్న వృద్ధురాలు వారందరిలో ఎవరిచేయి బాగా పండిందో చూస్తూ నీకు మంచి మొగుడొస్తాడులే! అనగానే ఆ పిల్ల బుగ్గల నిండుగా సిగ్గుతో ప్రహించే రక్తం కారణంగా ఎర్రబారి మరింత మనోహరంగా కన్పిస్తుంది. అక్కడకు వచ్చిన పిల్లతా గుండ్రని ఆకారంలో నిలబడి చప్పట్లు చరుస్తూ .
అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌.
ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌ .
చప్పట్లోయ్‌ తాళాలోయ్‌.
దేవుడిగుళ్ళో మేళాలోయ్‌.
పప్పూ బెల్లం దేవుడికోయ్‌.
పాలూ నెయ్యీ పాపాయికోయ్‌.
అంటూ పాడుతూంటే ఇంకా తయారుకాని పిల్లలు కూడా ఈ పాటవిని తయారై ఈ సంబరానికొస్తారు. .
వైద్య రహస్యం : మొదటగా ప్రారంభమయ్యేది చెమ్మచెక్కపాట. ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఎదురెదురుగా నిబడి తమ చేతులను చాచగలిగినంత వెడల్పుగా వెనుకకు చాపి ముందుకు తెచ్చి తమ అరచేతుతో ఎదుటి వారి అరచేతులను బలంగా చరుస్తారు.
ఇలా చేతులను వెనక్కు చాపడం మళ్లీ మందుకు సకాలంలో తేవడం, దీనికోసం నేలని బలంగా పట్టుకోవటం అంతా గొప్పవ్యాయామం. ఇదంతా వాయునాళం శ్వాసకోసం అనే వాటిలో తేడాగాని ఉన్నట్లయితే పసిగట్టగల వైద్యపరీక్షా విధానంగా భావించవచ్చు. చెమ్మచెక్క పాటలను గమనిద్దాం
చెమ్మచెక్క చారడేసి మొగ్గ
అట్లుపోయంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగ
రత్నాల చెమ్మచెక్క రంగులేయంగ
పగడాల చెమ్మచెక్క పందిరేయంగ
చూచి వద్దాం రండి సుబ్బారాయుడి పెండ్లి
మా వాళ్లింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి!
తరువాత :
కాళ్ళాగజ్జీ కంకోళమ్మ వేగుచుక్కా వెలగా మొగ్గా
మొగ్గాకాదు మెదుగబావీ బావీకాదు బచ్చలిపండూ
పండూకాదు నిమ్మవారీ, వారీకాదూ వావింటాకూ
ఆకూకాదు గుమ్మడిబెరడూ, కాలుతీసి గట్టునపెట్టు
చర్మవ్యాధి, గజ్జీకాని వస్తే కంకోళపు తీగని నూరి ఆ ముద్దని పెట్టాలట. తగ్గకపోతే వెలగమెగ్గని నూరి కట్టాలట దానికీ కుదరని పక్షంలో మోదుగాకు రసం, ఆ మీదట వావిలాకు రసం, చిట్టచివరకు గుమ్మడి గుజ్జు వాడితే గజ్జిపట్టిన కాలి గట్టునపెట్టే అవకాశం (వ్యాధి తగ్గటం) జరుగుతుందట. ఆ పాటలోని గూడార్థమిదే.
చిన్న పిల్లలు ఎత్తులెక్కి దూకటం, దెబ్బు తగిలించుకోవటం చేస్తుంటారు.
కొండమీద గుండు జారి కొక్కిరాయి కాలువిరిగే
వేపాకు పసుపూ వెల్లుల్లిపాయ
నూనెచుక్క బొట్టు
నూటొక్కసారీ పూయవోయ్‌
నూరీ పూటకొక్కతూరి
దెబ్బలు తగిలినపుడు పసుసు, వేపాకు, నువ్వుల నూనె బొట్టు కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పూటకొకసారి పూయాలని చెపుతుందీ పాట.
ఇంకా కనుమరుగవుతున్న పాటలు, ఆటలు : గుడుగుడు కుంచం, విసురు విసురు పిండి (తిరగలిపాట) తొక్కుడుబిళ్ళు, చింతగింజలాట, ముక్కు గిల్లుడు, దూదూ పుల్ల ఇంకా ఎన్ని ఆటలు పాటలో.
ఈ పండుగలో చివరిగా వీడ్కోలు చెప్పే పాట ఒక ఎత్తు. పిల్లతా గుండ్రంగా నిబడి చప్పట్లు చరుస్తూ
ఉత్తముని పేరేమి? ఊరు పేరేమి?
సత్యవంతుని గన్న సాధ్వి పేరేమి?
ఉత్తముడు రాముడూ, ఊరు ఆయోధ్య
సత్యవంతుని గన్నతల్లి కౌసల్య.
అని పాడి వెళ్ళిపోతున్న పిల్లల నెత్తిమీద ఆశీర్వచన పూర్వకంగానూ దృష్టిదోషం తొగించేందుకు అందరికంటే వయసులో పెద్దామె చిట్టిమొట్టి కాయల్ని రెంటిని నెత్తిమీద కొట్టి రెండట్లు పెడుతుందట.
ఇలా ఆడుకున్న పిల్లలు కొన్ని సంవత్సరా తరువాత ఎక్కడైనా కలుసుకున్నపుడు ఆ మధుర స్మృతులెంత మధురంగా ఉంటాయో! ఇంతటి ప్రాధానత్య కలిగినది తెలుగు వారి సొంతమైన అట్లతద్దె పండుగ