header

Bhadrapada Masam ….. భాద్రపద మాసం

Bhadrapada Masam ….. భాద్రపద మాసం

భాద్రపద మాసంలో రెండు విశేషాలున్నాయి. ఒకటి వరాహ జయంతి. దశావతారాల్లో ఇది మూడవది. కల్పాంత సమయంలో భూమి జలమయమైపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు మనువును పిలిచి... భూమిని పాలించమన్నాడు. భూమి నీటిలో ఉంది..ఎవరు పైకి తెస్తారు అంటాడు మనువు. సరిగ్గా అదే సమయంలో బ్రహ్మకు తుమ్ము వచ్చింది. ఆయన ముక్కులోంచి యజ్ఞవరాహమూర్తి పుట్టాడు. యజ్ఞవరాహము అంటే యజ్ఞంలో వాడే పదార్థాన్నీ శరీరంలో భాగాలుగా ఉన్నవాడు. అందుకే ఆయనది మంగళ స్వరూపం. బొటన వేంత దేహంతో పుట్టిన అతడు క్షణకాంలోనే భూమ్యాకాశాలకు పెరిగిపోయాడు. సముద్రంలో ఉన్న భూమిని బయటకు తీయడానికి వెళ్ళాడు. అదే సమయానికి హిరణ్యాక్షుడు ఆ భూమి నాది అని వరాహమూర్తితో యుద్దానికి దిగాడు. అప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు. ఆ రూపాన్ని స్మరిస్తే ఎంతో మంచిదట. శ్రీహరి భాద్రపద శుద్ధ తదియనాడు ఈ అవతారాన్ని స్వీకరించాడు.
ఆ మరునాడు పదహారు కుడుమల తద్దె. స్త్రీలు ఈ రోజున గౌరీ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. తరువాత వచ్చేది చవితి. అదే వినాయక చవితి. ఈ రోజున గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విద్యాబుద్దులు సంపదలు అభిస్తాయి.
మరునాడు రుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడట. ఇది చేసేటప్పుడు కశ్యపుడు, అత్రి, భరధ్యాజుడు మొదలైన సప్తర్షులతోపాటూ అరుంధతీదేవిని కూడా పూజించాలి. ఇలా చేస్తే సకల పాపాలు నశిస్తాయని చెబుతారు.ఈ వ్రతం చేయలేనివారు ఈ రోజున ఈ మహర్షులను ఒక్కసారైనా తలచుకోవాలి. మర్నాడు షష్టి. దీన్ని సూర్యషష్టి అంటారు. నిజానికి భాద్రపద మాసంలోని ప్రతి ఆదివారం నాడు సూర్యుణ్ణి ఆరాధిస్తే ఎంతో మంచిది.
ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శయనించిన శ్రీహరి ఈ రోజున మరోప్రక్కకు ఒత్తిగిల్లుతాడట. అందుకే ఇది పరివర్తన ఏకాదశి. ఈ రోజు ఉపవాసం చేసి శ్రీహరిని పూజిస్తే కరవుకాటకాలు తొలగిపోతాయట.
ఆ మరునాడు ద్వాదశి శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతార శ్రీకారం చేశాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కణ్ణుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని దేవతలకు ఇచ్చేందుకు బ్రాహ్మణులైన అదితి, కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మించాడు శ్రీహరి. బలిచక్రవర్తి నుంచి సకల భూమండలాన్ని స్వర్గలోకాన్ని దానంగా పొందాడు. సుత లోకాన్ని బలిచక్రవర్తికి ఇస్తున్నాను. నా సుదర్శన చక్రం అతడికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది. సావర్థి మన్వంతరంలో నేనే అతడ్ని ఇండ్రుణ్ణి చేసి తరువాత మోక్షమిస్తాను అని అనుగ్రహించాడు. అందుకే, ఈ రోజున వామనావతారాన్ని స్మరించుకుంటే మోక్షం భిస్తుంది.
పితృదేవతల పక్షం: మరునాడు చతుర్థశి ఇదే అనంత పద్మనాభ చతుర్థశి. ఈ రోజున అనంత పద్మనాభవ్రతం చేసి శేషతల్పశాయి అయిన శ్రీహరిని కొలిస్తే సకల సిరిసంపదలు కలుగుతాయి.
పౌర్ణమినాడు ఉమామహేశ్వరుల వ్రతం చేస్తారు. పార్వతీ దేవి ఈ వ్రతం చేసి శివుడి శరీరంలోని అర్థభాగాన్ని పొందిందట.
ఆ మర్నాటినుంచి అంటే కృష్ణపక్షం పితృదేవతలకు ఇష్టమైన కాంల. దీన్ని మహాలయ పక్షం అంటారు. ఈ పక్షమంతా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం వంటివాటి ద్వారా పితృదేవతలను ఆరాధించాలి. అలా పక్షం రోజులు చేయలేకపోతే కనీసం మహాలయ అమావాశ్య దాకా అన్నశ్రాద్ధం పెట్టాలట.
భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్లతద్దె. కన్నె పిల్లలు ఈ రోజున గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు