header

Dhanurmasam…..ధనుర్మాసం

Dhanurmasam…..ధనుర్మాసం

ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే పుణ్యసమయం (డిసెంబర్‌ 16 నుండి) అదే ధనుస్సక్రమణం.
నాటి నుంచి భోగి పండగ వరకూ పరమపవిత్ర కాలం తెలుగు వారి లోగిళ్లలో దీనిని నెలగంట అంటారు.
ఈ మాసంలోనే పరమాత్ముడు గోదాదేవిని ప్రేమగా స్వీకరించింది. గోదాదేవిని ఆండాళ్‌ అని పిలుస్తారు. ఈమె తమిళనాడులోని శ్రీవిల్లీపుత్తూరులో తులసి మొక్కలమధ్య దర్శనమిచ్చింది. ఈమెకు గోదాదేవి అని పేరుపెట్టి విష్ణుచిత్తుడనే పరమభక్తుడు పెంచి పెద్దచేశాడు. గోదాదేవి బాల్యం నుంచి శ్రీరంగనాధుడే సర్వస్వమని భావించింది. ఆ భగవంతుడే తన భర్త అని విశ్వసించింది. స్వామిని పొందటానికి ధనుర్మాస వ్రతం చేసింది. ముప్పైరోజులు ముప్పై పాశురాలతో కొలిచింది. పూజకోసం తండ్రి సిద్ధం చేసిన దండల్ని మెడలో వేసుకుని అందచందాల్లో తాను రంగనాధస్వామికి సరిజోడి అని మురిసిపోయింది. ఓ సారి విష్ణుచిత్తుడు పూలదండలో గోదాదేవి వెంట్రుకలను చూశాడు మహాపరాధం జరిగిందని బాధపడ్డాడు. రంగనాథస్వామికి మాత్రం విరుల సౌరభాకన్నా గోదాదేవి కురుల పరిమళమే నచ్చింది. విష్ణుచిత్తుడికి కలలో కనిపించి గోదా కళ్యాణానికి అనతి ఇచ్చాడు. ఆండాళమ్మ ఆ అనంతకోటి బ్రహ్మాండనాయకుడిలో అదృశ్యమైంది. పన్నిద్దరు ఆళ్వారులో ఒకే ఒక మహిళ గోదాదేవి.
గోదాదేవి మధురభక్తికి ప్రతీక. శ్రీకృష్ణదేవరాయలు ఈ అంశాన్ని తీసుకుని అముక్తమాల్యద అనే కావ్యాన్ని రాశారు. రాయలవారు కళింగయుద్దాన్ని ముగించుకుని విజయవాడ దగ్గరలోని శ్రీకాకుళం అనే గ్రామంలో ఆంధ్రమహావిష్ణువు ఆలయంలో విడిదిచేశాడు. ఆ రాత్రి ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి అండాళ్‌ మధురగాథను తెలుగులో ప్రబంధంగా రాసి సమర్పించమని ఆదేశించాడు. అలా తెలుగువారికి గోదాదేవితో ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది.
తిరుప్పావై : తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతం తిరుప్పావై వ్రతాన్ని శ్రీవ్రతమని అంటారు. సూర్యోదయానికి ముందే లేచి ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తి చేసుకుంటారు. గోదాదేవి పాడుకున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు. వయో లింగబేధాలు లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చుంటారు వైష్ణవ గురువు. ఇష్టఫలములను అందుకొనుటకు కష్టపడవలె చెల్లెలా.. అంటుంది గోదాదేవి చెలికత్తెతో ఓ పాశురంలో. ఆధ్యాత్మిక ఉన్నతికి శారీరక క్రలమశిక్షణ కూడా చాలా అవసరం ఓ వైపు వణికించే చలి. తెల్లవారుజామునే మేల్కొనాలి. ఆహార నియమాల్ని పాటించాలి. మితభాషణ చేయాలి. ఇతరులకు సాధ్యమైనంత ఇబ్బందిలేకుండా చూడాలి. అంటే ప్రియభాషణ కూడా అవసరమే. దానధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భోగాలకు దూరంగా ఉండాలి.
ఆలయాలో : రేపల్లెలో గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని నోచినట్లే.. గోదాదేవి పాశురాలతో శ్రీరంగనాథుని కొలుస్తుంది. తిరుప్పావై కృష్ణుడికీ గోపికకూ సంబంధించిన మామూలు కథలా అనిపించవచ్చు కానీ, పత్తిపువ్వును విప్పుతూ పోతే పత్తి ఎలా విస్తరిస్తుందో ప్రతి పాశురానికీ అంత విస్తారమైన అర్థం ఉంది అంటారు చిన జియర్‌స్వామి. ఇందులో రామాయణ, భారత సారాంశం ఉంది. అంతర్లీనంగా శ్రీవైష్ణవతత్వం, ఉపనిషత్‌ రహస్యాలు ఉన్నాయి.
వైష్ణావాలయాలు ధనుర్మాసంలో ఆధ్యాత్మికశోభతోపాటు వెలిగిపోతుంటాయి. విష్ణుసహస్రనామ పారాయణాలు, పాశురగానాలూ, గీతా ప్రవచనాలు ప్రతిధ్వనిస్తుంటాయి. తిరుమలలో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదుగా తిరుప్పావైతోనే స్వామిని మేల్కొలుపుతారు. ధనువు అన్న మాటకు ధర్మమనే అర్థమూ ఉంది. ఈ మాసంలో ఆచరించే ధర్మమే..మనలను మిగతా మాసాల్లోనూ కాపాడుతుందనీ సత్యమార్గంలో నడిపిస్తుందని పండితులు చెబుతారు.