భాద్రపద మాసంలో పౌర్ణమితో ప్రారంభమయిన పితృపక్షం అదే మాసం చివరిరోజుల్లో అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యనే మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు. పితృపక్షంలో పితృదేవతలు భగవాన్ శ్రీ మహావిష్ణువు అనుమతితో భూమిపైకి వస్తారు. వీరిని సంతృప్తి చేసేందుకు తర్పణం వదలాలి. కేవలం తర్పణమే కాదు అన్నదానం కూడా చేయాలి. కనీసం ఒక్క పేదవానికయినా అన్నదానం చేయాలని పురాణగ్రంథాలు పేర్కొంటున్నాయి.
అన్నదానం కేవలం మానవులకే కాకుండా జంతుజాలానికి కూడా పెట్టాల్సివుంటుంది. కాకి, ఆవు... తదితర వాటికి ఆహారం సమర్పించాలి. ‘‘లోకానం నరజన్మం దుర్లభం’’ అంటారు శంకర భగవత్పాదులు. ఎన్నో వేల జన్మలకు గానీ నరజన్మ ప్రాప్తించదు. అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తుంచుకుని ప్రార్థించాలి.
అందుకే పితృపక్షంలో కనీసం ఒక్కరోజైనా వారికి తర్పణం వదలాలి. సాధ్యం కానివారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం అన్ని విధాలుగా శుభాలను చేకూరుస్తుంది