header

Radhasaptami… రధసప్తమి

Radhasaptami… రధసప్తమి

రథసప్తమి భారతీయులకు శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.
ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో చెప్పబడింది.
సౌరమానం, చాంద్రమానం, బార్హ స్పత్సమానం మొదలైనవి కాలగమన విధానంలో ప్రసిద్ధమైనవి. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమినాడు వచ్చే ‘రథసప్తమి’ని సూర్యవ్రతం అని పిలుస్తారు. మాఘమాసంలో ‘శుద్ద సప్తమి’, ‘సూర్యసప్తమి’, ‘అచలాసప్తమి’, ‘మహాసప్తమి’, ‘సప్తసప్తి సప్తమి’ అనీ... ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే సూర్యారాధనకు, సూర్యవ్రతానికి విశిష్టమైన పర్వదినంగా భావిస్తున్న రోజు ‘రథసప్తమి’ దినంగా ‘సూర్యజయంతి’గా కూడా జరుపుకోవడం మన సంప్రదాయం.
ఈ సప్తమినాడు సూర్యోదయాన ఆకాశంలోని నక్షత్ర సముదాయం రథాకారాన్ని పోలి ఉండడం చేత ‘రథసప్తమి’ అని అంటారు. సూర్యుడు మాఘశుక్ల పక్షం అశ్వనీ నక్షత్రయుక్త ఆదివారం, సప్తమి తిథిన దక్ష ప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి, కశ్యపులకు పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.
విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య. ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున, యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ సూర్యని వేడిని భరించలేక తనకు మారుగా ఛాయను సృజించి, కొంత కాలము భర్తకు దూరంగా ఉన్నసమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం చేత ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు జన్మించాడు.
నియమాలు
శ్లో || సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మమాలమ్
మాఙే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్య సంపద:
షష్ఠి నాడు రాత్రి ఉపవసించి సప్తమినాడు అరుణోదయమున స్నానమాచరించినట్లైతే ఏడు జన్మల పాపము తొలగిపోవునని, రోగశోకములు నశించుననియు, ఏడు విధములైన పాపములు పోతాయని విశ్వాసం. ప్రాతఃకాలములోనే స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి, మట్టి ప్రమిదలలో, దేనిలోనైనా నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీపజ్యోతులను తలపై పెట్టుకుని నదీ జలాల్లో గానీ, మనకు దగ్గరగా కాలువలో పారే జలాల్లోగానీ తటాకాదులకు గాని, వెళ్లి సూర్యుని ధ్యానించి, ఆ దీపమును నీటిలో వదిలి, ఎవ్వరును నీటిని తాకకముందే స్నానము చేయాలి. స్నానము చేసేటప్పుడు ఏడు జిల్లేడుఆకులు గానీ, ఏడు రేగాకులుగాని తలపై ఉంచుకుని..
శ్రో|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే
అనే మంత్రంతో స్నానం చేయాలి. "సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.
సూర్యునకు అర్ఘ్యమిచ్చి పూజించి-అటుపైన పితృతర్పణము చేయాలి. పితృతర్పణము చేసేటప్పుడు తామ్రపాత్రముగాని, మట్టిపాత్రముగాని చిమ్మిలి వంటి పదార్థమును చేసిపెట్టి, దానిని ఎర్రగుడ్డతో కప్పి గంధపుష్పాక్షతలతో పూజించి, బ్రాహ్మణులకు దానమివ్వాలి.
సర్వదేవతామయుడు, సర్వవేదమూర్తి సూర్య భగవానుని ఈ రోజుల్లో ఆరాధించడం ఆరోగ్యాన్ని-ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మాసమంతా నియమంగా సూర్యుని ఆరాధిస్తూ.. "ఆదిత్య హృదయం" వంటివి పారాయణం చేయడం మంచిది. ప్రతి ఆదివారం ఉదయాన్నే శుచిగా క్షీరాన్నం (పాయసాన్నం) వండి సూర్యునికి అర్చించాలి. ఆ రోజు తరిగిన కూరల్ని తినరాదు. (కత్తి తగలని పదార్థాలను తినవచ్చు).