header

Toli Ekadasi / తొలి ఏకాదశి

Toli Ekadasi / తొలి ఏకాదశి

ఆషాఢ శుక్ల ఏకాదశిని ‘తొలి ఏకాదశి’, ‘శయనేకాదశి’ అంటారు. ఇదే పర్వదినాన క్షీరాబ్ధిలో శ్రీమహావిష్ణువు శేషపాన్పు మీద పవళించి ఉంటాడని భావిస్తారు. ‘చాతుర్మాస్యం’ అంటే నాలుగు నెలల సమయం. ఆషాఢ శుక్ల ద్వాదశి నుంచి కార్తిక శుక్ల ద్వాదశితో ముగిసే ఈ పవిత్ర సమయంలో భక్తులు చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. దీని విశేషాల్ని స్కాంద, భవిష్యోత్తర పురాణాలు వివరిస్తున్నాయి.
ఏకాదశినాడు ఉపవాసం ఉండి, చాతుర్మాస్య వ్రతం ప్రారంభించి, నాలుగు నెలలూ నియమ నిష్ఠలతో ఆచరించడం శుభప్రదమని పురాణగాథలు చెబుతున్నాయి. ఈ వ్రతం స్త్రీలకు అత్యంత ప్రధానమైనదని భీష్మ పితామహుడు ప్రవచించాడు. ఇదే వ్రత ప్రాముఖ్యాన్ని గౌతమబుద్ధుడు అనుభవపూర్వకంగా తెలియజెప్పినట్లు ‘జాతక కథలు’ వెల్లడిస్తాయి. ఈ వ్రతాన్నే జైనులు స్నానోత్సవంగా ఆచరిస్తారు. నాలుగు మాసాలూ క్షీరాబ్ధిపై విష్ణువు యోగనిద్రలో ఉండటం వల్ల, నదులు ఆధ్యాత్మిక ప్రభావ శక్తి కలిగి ఉంటాయంటారు. గృహస్థులకు, వానప్రస్థ ఆశ్రమం స్వీకరించినవారికీ ఇది ఫలప్రదమయ్యే తరుణమని ‘నిర్ణయసింధు’ తెలియజెబుతోంది. హిందువులు, బౌద్ధులు, జైనులతో పాటు పలు మతాలవారు ఈ వ్రతానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు అశోక శాసనాలు వెల్లడిస్తున్నాయి.
చాతుర్మాస్య వ్రతారంభంలో సాధువు ‘ఈ వర్షకాలంలో సంచరించే క్రిమికీటకాల్ని ఎవరూ హింసించకుండా చూసేందుకు ఇక్కడ ఈ నాలుగు నెలలూ ఉంటాను’ అని గృహస్థుడితో అంటాడు. అతడు మహదానందంతో ‘మీకు శుశ్రూష చేయడం మాకు ఆనందదాయకం. ఇక్కడే ఉండి మమ్మల్ని కృతార్థుల్ని చేయండి’ అని స్వాగతిస్తాడు. అలా ఈ శుభ తరుణం అహింసాధర్మాన్ని ప్రబోధిస్తుంది. క్రిమికీటకాలు అంతరించరాదన్న భావంతో వంటల్ని నిలిపివేసి, ఉపవాసాలకు ప్రాధాన్యమిస్తారు. విష్ణు సంబంధమైన ఆరాధనలు పాపహరణాలని భక్తులు విశ్వసిస్తారు.
బాల్యంలో తల్లితోపాటు చాతుర్మాస్య వ్రతం చేయడం వల్ల విశేష జ్ఞానప్రాప్తి కలిగిందని నారద మహర్షి అనుభవం చెబుతుంది. ఇదే కాలంలో వ్యాసపూర్ణిమ గురుపౌర్ణమిగా సమాదరణ పొందుతోంది. స్మార్త సాధువులకు వ్యాసపూజతో ఆరంభమయ్యే ఈ వ్రతం విశ్వరూప యాత్రతో ముగుస్తుంది. చాతుర్మాస్యం సర్వగుణయుక్త సమయం. శ్రద్ధాపూర్వకంగా వేద, పురుషసూక్త పఠనాలు; దానం, సత్సాంగత్యం, ప్రాతఃకాల స్నానం, ఉపవాసం, దైవాభిషేకం, బ్రహ్మచర్యం, సత్యవాక్పాలన, పురాణ శ్రవణం, మిత భాషణం, మిత భోజనం చేస్తారు. పంచాక్షరి, ద్వాదశాక్షరి జపిస్తారు.
ఈ పావన సమయాన్ని యోగ-ధ్యాన తత్పరతతో పాటు భూతదయ; అన్న, జల, గోదానాలతో సద్వినియోగం చేసుకోవాలంటారు పెద్దలు. ఆత్మస్తుతి, పరనింద తగవని హితవు చెబుతారు. నదీస్నానం విశేష ఫలమిస్తుందని భావిస్తారు. ఎటువంటి పదార్థాల్ని భుజించాలో వివరించడం వల్ల, ఈ వ్రతం మానవుడి ఆరోగ్య పరిరక్షణకిచ్చే ప్రాధాన్యం తేటతెల్లమవుతుంది. ఆరోగ్యం బాగుంటేనే, ఆధ్యాత్మిక జ్ఞాన సంపదా వృద్ధి చెందుతుంది. యోగనిద్రలో ఉండే విష్ణు భగవానుణ్ని ప్రసన్నం చేసుకొనేందుకు భక్తుల యోగముద్రలు దోహదపడతాయనీ అంటారు. ఈ వ్రత శుభ తరుణంలో సాగించే యోగసాధన, చేసే సత్కార్యం సత్వర ఫలసిద్ధి కలిగిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం!