header

worship

దీపారాధన ఎందుకు చేయాలి? ........డా.అనంతలక్ష్మి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త

మనకు ప్రత్యక్షదైవాలు ముగ్గురు. ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు, ఇంకొకరు అగ్నిదేవుడు. సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. చంద్రుడికి నూలుపోగు వేసి కృతజ్ఞత చెప్పుకుంటాం. మరి అగ్నిదేవుడూ... ఆయన్ను అర్చించేందుకే పూర్వం పెద్దలు ఇంట్లో నిత్యాగ్నిహోత్రం నిర్వహించేవారు. రోజూ అగ్ని దేవుడిని ఆవాహన చేసి నమస్కారం చేసేవారు.
నిజానికి మనం భగవంతునికి ఇవ్వదలచుకున్నది ఏదైనా ఆయనను చేరాలంటే అగ్ని ద్వారా మాత్రమే ఇవ్వగలం. మనం అగ్నిలో ద్రవ్యాన్ని వేస్తూ ‘ఇంద్రాయ స్వాహా...’ అన్నామనుకోండి అగ్ని దాన్ని నేరుగా ఇంద్రుడికి చేరుస్తాడు. అదీ అణువంత కూడా ఆయన ఉంచుకోకుండా. ఇలా ఏ దేవుడి పేరు చెప్పి మనం ద్రవ్యాన్ని సమర్పిస్తే ఆయనకు చేరవేస్తాడు అగ్ని. అంటే భగవంతుడికీ మనకీ అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు. కానీ ఇలా నిత్యం అగ్నిహోత్రం వెలిగించడం అందరికీ, అన్నిరోజులూ సాధ్యం కాదు కనుక కనీసం దీపారాధన చేయడం ద్వారా మనం అగ్నికి నమస్కారం చేసుకుంటాం.
ధూపం ఆఘ్రాపయామి అంటాం, నైవేద్యం పరికల్పయామి అంటాం కానీ దీప ఆరాధన అంటాం. అంటే నేరుగా దీపాన్నే పూజించటం. అందుకే దీపానికి కుంకుమపెట్టి, ఓ పువ్వూ, నాలుగక్షతలూ వేసి, ఇలా చెబుతాం...
సాజ్యం త్రివర్తి సంయుక్తం
వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం
త్రైలోక్యం తిమిరాపహం
ఈమూడు వత్తులతో నేను వెలిగించిన దీపం మూడు లోకాలలోని చీకట్లను పారదోలాలి అని దీనర్థం. మన ఇల్లు ఒక్కటే కాదు, మూడు లోకాలూ వెలుగులు విరజిమ్మాలన్న గొప్ప భావన ఇందులో దాగుంది. అచ్చంగా దీపానికే పూజచేసే సంప్రదాయమూ కొన్ని చోట్ల ఉంది. మనకిష్టమైన దైవాన్ని దీపపు వెలుగులో చూస్తూ పూజ చేయడం మరో పద్ధతి.