ఆలయంలోకి ప్రవేశించగానే మనం చేసేపని ప్రదక్షిణ. ప్రదక్షిణలోనూ రెండు రకాలు. ఒకటి ఆత్మప్రదక్షిణ, రెండోది దైవ ప్రదక్షిణ. దేనికదే ఓ ప్రత్యేకత కలిగింది. నిజానికి మనం ఆలయంలోకి ప్రవేశించగానే దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. మంత్రపరంగానైతే ప్రదక్షిణల్లో మనం సత్వ, రజో, తమో గుణాల్ని విడనాడి త్రిగుణాతీతంగా అవుతామనీ, అలాంటి స్థితిలో దైవ ప్రార్థన చేయాలనీ చెబుతాం. ప్రదక్షిణ వల్ల శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఏ రకంగా అంటే...
ముందుగా మనం ఆత్మ ప్రదక్షిణను తీసుకుందాం. బొంగరం సాధారణంగా పడిపోయి ఉంటుంది. అది ఎప్పుడైతే తనచుట్టూ తాను తిరగడం మొదలు పెడుతుందో అప్పుడు నిటారుగా నిలబడగలుగుతుంది. ఇక్కడ ప్రదక్షిణ బొంగరానికి నిలబడే శక్తిని ఇస్తుందన్నమాట. అలాగే భూమిని చూద్దాం...
అది నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. విశ్వంలో వేలాడుతున్నట్టు కనిపించినా దానంతట అది నిలబడేందుకు కావలసిన శక్తిని భ్రమణం ఇస్తుంది. అలాగే, భూమి నిరంతరం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి నుంచి శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. ఇదేవిధంగా మనం శక్తికేంద్రకమైన దైవం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆయన్నుంచి శక్తిని పొందుతాం. ఇందులోనూ మరో విషయం ఉంది, ప్రదక్షిణ అంటే కుడిదిశలో తిరగడం అని అర్థం. అంటే మనం సవ్యదిశలో తిరుగుతామన్నమాట. విశ్వంలో ఏ పదార్థమైనా సవ్య దిశలో తిరిగినప్పుడు దాన్నుంచి పాజిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తుంది.