header

Sastanga Namaskaram

సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి? .....డా.అనంతలక్ష్మి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త

మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే...
ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం. భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.
వేల సంవత్సరాల నాడు రుషులూ, మునులూ తాము తపించి, ఆచరించి, అనుభవంలోకి తెచ్చుకున్న ఎన్నో విషయాలనూ, విశేషాలనూ భగవంతుడికి దగ్గరగా బతికేందుకంటూ ఇలా పూజా రూపంలో పొందుపరిచి మనకందించారు. ఇందులో ఏది ఎందుకు చేయాలీ, అన్న ఆలోచన ఎలా ఉన్నా...
మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు వెళ్లే స్వచ్ఛతను అందిస్తాయివి. అంతేకాదు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్నీ, మనసును అదుపులో ఉంచుకునే చాకచక్యాన్నీ, మనల్ని మనం గమనించుకుంటూ బతికే నైపుణ్యాన్నీ దోసిటపట్టే పట్టునిస్తాయి. అలాంటి స్థిరమైన మనసుతో, మనమీద మనకు అదుపుతో, ప్రశాంతంగా జీవిస్తే... ‘శతమానం భవతి’ అనే వేదవాక్కు ఫలించదంటారా!