శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకం. ఈ మధ్య పిరమిడ్ ధ్యానం, పిరమిడ్ థెరపీ గురించి వింటూనే ఉన్నాం. మన చుట్టూ ఉండే వివిధ రకాల శక్తులను ఒకచోటికి తెచ్చి, మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగానూ స్వస్థపరచేలా ఈ ఆకారాలు సాయపడతాయన్నది ఇందులోని విషయం.
గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్ తరహా) నిర్మాణాలూ పిరమిడ్ తరహాలోనే పనిచేస్తాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటాన్ని మనం గమనించొచ్చు. అందువల్ల శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది. ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది. అదే జ్ఞానులూ, యోగులకు దాదాపు జానెడు ఎత్తులో ఉంటుంది. అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
శఠగోపాన్ని ఆరు అంగుళాలూ, ఎనిమిది అంగుళాలూ లెక్కన ఎత్తుగా చేయడం వెనక సహస్రార చక్ర స్థితి ముడిపడి ఉంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు.