పూజ చేయడం అంటే భగవంతుడిని మన ఇంటికి ఆహ్వానించి సేవించడం. అంటే మనకు దేవుడు ఒక ప్రత్యేకమైన అతిథి అన్నమాట. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి సత్కారాలు చేస్తామో అదే విధంగా దేవుణ్ణీ సేవించడమే పూజావిధానం.
ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞొపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం - ఈ పదహారూ షోడశోపచారాలు. ఇంట్లోకి అతిథి వస్తున్నప్పుడు ఎదురెళ్లి లోపలికి తీసుకువస్తాం, అది ఆవాహనం. వచ్చాక కుర్చీ వేస్తాం, అది ఆసనం. కాళ్లు కడుక్కునే నీళ్లు ఇవ్వడాన్ని పాద్యం అంటారు. చేతులుకడుక్కునే నీళ్లు అర్ఘ్యం, ఇక దాహానికి ఇచ్చే నీరు ఆచమనీయం. తర్వాత స్నానానికి నీళ్లు పోసి, కట్టుకునేందుకు వస్త్రం ఇస్తాం. ఆ తర్వాత యజ్ఞొపవీతం సమర్పిస్తాం. తర్వాత భగవంతుడికి బొట్టు పెట్టి, చల్లటి గంధాన్ని రాస్తాం. పూలతో అలంకారం చేస్తాం. ఆ తర్వాత వాతావరణాన్ని హాయిగా చేసేలా ధూపం రూపంలో కాస్త పరిమళం వేస్తాం. ఆ చోటంతా కాంతిమంతంగా అనిపించేందుకు దీపాన్ని చూపిస్తాం.
తర్వాత పూజను బట్టి, ముందుగా అవసరార్థ నివేదనమని ఏ బెల్లపు ముక్కో, అరటి పండో పెట్టేస్తాం. లేదంటే, మహానైవేద్యం సమర్పిస్తాం. తర్వాత చక్కగా సుగంధ ద్రవ్యాలతో నిండిన తాంబూలాన్ని అందిస్తాం. చివరిగా హారతిచ్చి, మనల్ని మనమే ఆయనకు అర్పించుకునే క్రతువుగా మంత్రపుష్పాన్ని సమర్పించి పూజను ముగిస్తాం. మనింటికి వచ్చిన మహా అతిథిని మనకున్నంతలో గౌరవంగా చూసుకోవడమే ఈ షోడశోపచారాల పరమార్థం.