భారతీయ సంప్రదాయంలోని పూజావిధానాల వెనుక మానసిక, శారీరక ఔన్నత్యానికి దోహదపడే విశేష క్రియలున్నాయి. దీపారాధన మొదలు హారతిదాకా... గంట కొట్టడం మొదలు మంత్రపుష్పందాకా ప్రతి క్రతువులోనూ మంత్రాలకు మించినది ఉందంటే, మన ధర్మానికి ఎంత విశిష్టత ఉందో అర్థమవుతుంది. ఆ ధర్మ సూక్ష్మాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా.అనంతలక్ష్మి తెలియపరుసుతన్నారు... శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం శత సంవత్సరం దీర్ఘమాయుః... అంటూ వందేళ్లు ఐశ్వర్యంతో ఆరోగ్యంగా జీవించమని దీవిస్తుంది వేదం. నిజానికి ఇక్కడ శతం అనే పదానికి పూర్ణం అనే అర్థం వస్తుంది. అంటే నిండైన జీవితంతో పాటు నిండైన ఆరోగ్యం, నిండైన ఐశ్వర్యం కూడా ఉండాలని భావం. మన జీవన విధానం అంత బాగుండాలని ఆశీర్వదించే ఆ మహాగ్రంథాలు ఏ మార్గంలో ప్రయాణిస్తే, ఎలాంటి క్రతువులు ఆచరిస్తే మనం నిండునూరేళ్లూ వర్థిల్లుతామన్న సంగతిని చెప్పకుండా ఉంటాయా..! ఆ దిశలో మనిషికి దిశానిర్దేశం చేయకుండా ఉంటాయా..! వెలుగునిచ్చే జ్యోతిని నిత్యం పూజించమనే ఆ జ్ఞానదీపికలు మన బతుక్కి వెలుగుబాటలు పరవకుండా ఉంటాయా..! మనిషి జననం మొదలు నిండు నూరేళ్ల పాటూ జరగాల్సిన క్రతువులూ మరణానంతరం నిర్వహించే సంస్కారాల వరకూ అన్ని విషయాలనూ వేదాలు పూసగుచ్చినట్టు చెప్పాయి. నల్లేరుమీద నడకలా జీవితాన్ని నడుపుకోవడమే కాదు అప్పుడప్పుడూ వచ్చే పెనుతుపానులను సమర్థంగా ఎదుర్కొనేందుకూ స్థైర్యాన్ని ఇచ్చేలా, ప్రతిదశలోనూ పాటించాల్సిన పూజా విధానాల్ని పొందికగా మలిచి మనకందించాయి. పంచభూతాలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కొన్నీ, మానసిక ప్రశాంతతను ప్రసాదించేవి కొన్నీ, ఆరోగ్యాన్ని అమర్చిపెట్టేవి కొన్నీ... అన్నీ మనకోసమే, మన బాగుకోసమే. తెలిసో తెలీకో భక్తితోనో భయంతోనో మనం యాంత్రికంగా చేసే వివిధ క్రియల వెనుక పరమార్థాన్ని తెలుసుకుంటే మన పూజకూ ఓ నిండుదనం వస్తుంది.