ఇతను కవి. అసలు పేరు భాగవతుల శంకరశాస్త్రి. కలం పేరు ఆరుద్ర. ఇతని రచనలు సమగ్ర ఆంధ్ర సాహిత్యం, త్వమేవాహం, సీనీవాలీ, కూనలమ్మ పదాలు,సీనీ గేయం రచయిత.
ఇతను ఆదునిక ఆంధ్రసాహిత్య చరిత్రలో ఒక గౌరవ స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప కవి. వీరి జన్మస్థలం విశాఖపట్నం. 1925 ఆగస్టు 31వ తేదీన జన్మించారు. ప్రాధమిక, మాధ్యమిక విద్య విశాఖపట్నంలోనూ, కళాశాల విద్య విజయనగరంలోనూ చదువుకున్నారు. 1943 నుండి 1947 వరకు భారతీయ వైమానిక దళంలో బ్యాండ్ బాయ్ గా పనిచేశారు. తరువాత మద్రాసుకు మారి ఆనందవాణి అనే పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. మద్రాసు వచ్చిన కొత్తలో కొంతకాలం చాలా ఇబ్బందులు పడ్డారు. తినటానికి తిండిలేక పార్కు కుళాయి నీటితో కడుపు నింపుకున్నానని చెప్పకున్నారు.
1949 నుండి అనేక సినిమాలకు మాటలు, పాటలు వ్రాసారు. వీరు చదరంగం మీద చక్కని పుస్తకం వ్రాసారు. అతి సులభమైన భాషలో వీరు వ్రాసిన 'కూనలమ్మ పదాలు' చాలా ప్రాచుర్యం పొందాయి. రామాయణం గురించి, ఎక్కువగా పరిశోధనాత్మకంగా చదివి 'రామునికి సీత ఏమవుతుంది?' అనే సంచలన గ్రంధాన్ని రచించారు. ఆరుద్ర శ్రీ శ్రీ శిష్యుడు, మేలుజాతి రత్నం కూడా.
రాదారి బంగళా, శ్రీకృష్ణ దేవరాయులు, కాటమరాజు కథ వంటి నాటకాలు వ్రాసారు. వేమన వేదం, మన వేమన, వ్యాసపీఠం గురజాడ పీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటి విమర్శనా గ్రంధాలు వ్రాసారు.త్యమేవాహం వీరి రచనలలో ముఖ్యమైనది. తెలంగాణా రజాకార్ల పాలనలో జరిగిన అకృత్యాలు ఈ రచనకు మూలవస్తువు.
ఈ మహానీయుడు 1998 జూన్ 4వ తేదీన మూత్రపిండాల వ్యాధితో హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో కనుమూసారు.