వీరు చలంగా సుప్రసిద్ధులు. వీరు సాహిత్యస్రష్ట, వేదాంతి, తెలుగు రచయిత, సంఘసంస్కర్త. స్త్రీలకు స్వేచ్ఛ అవసరమని ఈయన రచనలలో తెలియజేసారు. చిత్రాంగి, సావిత్రి,శశి, పాపం, మైదానం వీరి ముఖ్య రచనలు. వీరి రచనలు ముఖ్యంగా స్త్రీలను ప్రధానంగా తీసుకుని వ్రాసినవి. వీరి రచనా శైలి ప్రత్యేకంగా ఉంటుంది.
వీరు 1894 సం.లో మే18వ తేదీన మద్రాసు నగరంలో జన్మించారు. మద్రాసులో బి.ఏ చదువుకున్నారు. ఇతనికి చిన్నవయసులో వివాహమైంది. కళాశాలకు వెళ్లేటపుడు 13 సంవత్సరాల వయసున్న తన భార్యను కూడా కాన్వెంట్ లో చేర్చి తన సైకిల్ పై వదిలి పెట్టేవాడు.
ఆ రోజులలో ఇతని రచనలలలోని భావాలు, ప్రతిపాదించిన విషయాలు సమాజం మీద తీవ్ర ప్రభావం చూపాయి. సమాజం ఇతనిని అపార్ధం చేసుకున్నది. ఇతని రచనలు చదివే వారు కాదు. చదవటానికి భయపడేవారు. ఇతను సమాజానికి దూరమయ్యాడు. భార్య కూడా బంధువులకు దూరమైంది. చెడిపోయిన వాడుగా పేరు తెచ్చుకొన్నాడు.అద్దెకు ఇల్లు కూడా ఇవ్వటానికి భయపడ్డారు. ఈ స్థితిలో భార్యతో సహా అనేక భాధలు అనుభవించారు. చాకలి, పనివారు దొరకలేదు. మాట్లాడేవారే కరువయ్యారు.
ఈ పరిస్థితులతో విసిగి పోయిన చలం విజయవాడలోని సొంత ఇల్లు అమ్మివేసి అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు.
1979సం. మే 4వ తేదీన అరుణాచలంలోనే వీరు పరమ పదించారు.