దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేకట శాస్త్రి వీరిద్దరినీ కలిపి తిరుపతి వేంకట కవులు అని అంటారు. అంధ్రదేశం అంతటా సంచారం చేసి ఈ జంటకవులు చేసి అష్టావధాన, శతావధానాలు ఎంతో పేరుపొందాయి.
వీరిలో తిరుపతి శాస్త్రి 1872 సం. మార్చి 22న జన్మించారు. తండ్రి వేంకటావధాని, తల్లి శేషమ్మ. వేంకటశాస్త్రి 1870 ఆగష్ట్ 28న జన్మించారు. తండ్రి కామయ్య, తల్లి చంద్రమ్మ. వీరువురూ కాశీ పండితుడు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద శిష్యరికం చేసి జంటకవులయ్యారు. 19 ఏళ్ల ప్రాయంలో ఈ జంటకవులు కాకినాడలో మొదట శతావధానం చేసి అక్కడి పండితులనూ ఆంగ్ల విద్యాధికులనూ ముగ్ధులను చేశారు. అది మొదలు తెలుగు నేలలో తిరుగుతూ అసంఖ్యాకంగా అవధానాలు చేశారు.
ఈ జంటకవులు కాళీ సహస్రంధాతు రత్నాకరం, సుకన్యా శృంగార శృంగాలు, కాష్టకములు అనే సంస్కృత కృతులూ, దేవీ భాగవత పురాణం అనువాదం, శ్రవణానందం, లక్షణా పరిణయం అనే తెలుగు కావ్యాలు రచించారు. శ్రీనివాస విలాస చంపువును తెలుగులోనికి అనువదించారు.
మృచ్ఛకటికం, ముద్రారాక్షసం, బాలరామాయణం అనే సంస్కృతత నాటకాలను తెలుగులోని అనువదించారు. భారతకథను 5 నాటకాలుగా వ్రాశారు.
ఇవిగాక దంభవాయన, సుకన్య, పండితరాజు, అనర్ఘనారదం అనే రపకాలు, పాణిగ్రహీత పతివ్రత, శివభక్తి, శివపురాణం, సుశీల, గోదేవి వంటి ప్రబంధాలు, విక్రమాంక దేవచరిత్ర, చంద్రప్రభ చరిత్ర, హర్షచరిత్రి అనే గద్యకృతులు, గీరతము, గుంటూరు సీమ వంటి పద్య సంకలనాలు, ‘‘జాతక చర్య’’ నానారాజ సందర్శనం, శతావధాన సారము వంటి పద్య రచనలు వీరి ఇతర కృతులు.
తిరుపతి వేంకటకవులు ‘‘పల్లెటూళ్ల పట్టువల’’ అనే క ప్రహసనం, కామేశ్వరీ శతకం కూడా వ్రాశారు. 1920సం.లో తిరుపతి శాస్త్రి స్వర్గస్తులైన తరువాత 30 ఏళ్లు జీవించిన వేంకటశాస్త్రి తన రచనలను అన్నిటినీ తిరుపతి వేంకటీయములుగానే ప్రచురించడం గమనించిన వారిద్దరి సాహిత్య మైత్రి ఎంత గాఢమైనదో తెలుస్తుంది.
వేంకటశాస్త్రిని ఆంధ్రాయూనివర్శిటీ ‘‘కళాప్రపూర్ణ’’ అనే బిరుదుతో గౌరవింపగా నాటి మద్రాసు ఉమ్మడి ప్రభుత్వం ప్రధమాంధ్ర ఆస్థానకవిగా సత్కరించింది.
వీరు 1950 సం.లో మార్చిలో విజయవాడలో పరమపదించారు.
తిరుపతి వేంకటకవులు వ్రాసిన పాండవోద్యోగ విజయాలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి.