ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్తావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్న. లగ్నము పెట్టటం దగ్గరనుండి గృహప్రవేశము వరకు 75 గద్య పద్యములలో ఆనాటి పెళ్ళితంతు గురించి తన ''రాజశేఖర చరిత్రలో'' వర్ణించాడు.
ఇతను 516 గద్య పద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అనే కావ్యమును రాయల ఆస్థానములో చేరక ముందే రచించినాడు. తన కావ్యమును వినుకొండ-గుత్తిసీమలను పరిపాలించిన నాదెండ్ల అప్పన మంత్రికి అంకితమిచ్చాడు.
అప్పన మంత్రి తిమ్మరుసు మేనల్లుడు మరియు అల్లుడు కూడా. రాయలతో పాటు దండయాత్రలకు, తీర్థయాత్రలకు తప్పకుండా వెళ్ళే కవులలో మల్లన ఒకడు. రాయల కొలువులో మొదలు నుండి ఉన్నా రాజశేఖర చరిత్రలో రాయల ప్రస్తావన లేదు. మల్లన తన గురించి రాజశేఖర చరిత్రలో పెద్దగా చెప్పుకోలేదు. మల్లన కృష్ణాజిల్లా అయ్యంకి పురమునకు చెందిన వాడుగా భావిస్తున్నారు. కాని కడప జిల్లాలో పెరిగినాడు. ఈయన గురువు కడప జిల్లా పుష్ఫగిరికి చెందిన అఘోర శివాచార్యులవారు.