ఇతని స్వస్థలం తూములూరు(పెరిగిన ఊరు) తెనాలి (గుంటూరు జిల్లా) తల్లి లక్ష్మమ్మ. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధుడు. తొలుత సామాన్య వ్యక్తి అయిన ఇతడు కాళీమాత వరప్రసాదం చేత కవీశ్వరుడు అయ్యాడు. హాస్యకవిగా, వికటకవిగా పేరు పొందాడు.
సత్తెనపల్లి మండలానికి చెందిన లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్యాంబ దంపతులు ఇతని తల్లితండ్రులు. తాత, సుదక్షిణా పరిణయం వ్రాసిన అప్పన్నకవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడులోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్డురాయి ప్రతిష్టించిన ప్రాంతంలోనే రామకృష్ణుల ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం.
చిన్నతనంలోనే తల్లి దండ్రులు మరణించటంతోనే మేనమామ తెనాలి ఆగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్ళారు. అక్కడే విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు.
తెనాలి నుండి రాయలవారి ఆస్థానానికి వచ్చాడు కనుక తెనాలి రామలింగకవిగా ప్రసిద్ధి పొందాడని ఒక అభిప్రాయం. క్రీ.శ. 1514 నుండి 1575 వరకు జీవించాడని ఆధారాలు.
రచనలు : ఉద్భాటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యము. పాండురంగ మహాత్మ్యము. ఉద్భాటారాధ్య చరిత్ర ఉద్భటుడు అనే ఒక యతి గాధ. ఘటికాచల మహాత్మ్యము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలంలోని ఘటికాచల క్షేత్రంలో వెలసిన శ్రీ నారసింహస్వామి వారిని స్తుతిస్తూ వ్రాసిన కావ్యం (ఘటికాచలం ప్రస్తుతం తమిళనాడు లోని పోళింగూర్). పాండురంగ మహాత్మ్యం, స్కాంద పురాణము నందలి విఠ్ఠలుని మహాత్యములు మరియు ఇతర పాండురంగ భక్తుల సంపుటం.
లభ్యంకాని ఇతర రచనలు : హరిలీలా విలాసము, కందర్పకేతు విలాసము.