ఇతని అసలు పేరు వరదయ్య. ఇంటి పేరు మొవ్వ. ఇతని జన్మస్థలం కృష్ణాజిల్లాలోని మొవ్వ గ్రామం. ఈ ఊరిలో వెలసిన వేణుగోపాలస్వామి ఇతని ఇష్ట దైవం. కర్నాటక సంగీతంలో పేరేన్నిక గన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య ఒకడు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి వివరాలు తెలుసుకుంటూ ఉండటం వలన ఇతనికి క్షేత్రజ్ఞడు అనే పేరు వచ్చినది. క్రమేపి అది క్షేత్రయ్యగా మారింది.
జనంలో ఉన్న కధనం. క్షేత్రయ్య చిన్నతనం నుండి గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకున్నాడు. సహపాఠి అయిన మోహనాంగి అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు రుక్మిణితో వివాహం జరిగింది. కాని మోహనాంగి మీద అతని మక్కువ తగ్గలేదు. మోహనాంగి చాలా వివేకం గల పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వవేణుగోపాలనిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పిస్తే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని షరతు విధించినదని అంటారు.
మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేసి ప్రపంచంలోని జీవాత్మలన్నీ స్త్రీలని పరమాత్ముడైన మువ్వ గోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదని అంటారు. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. మోహనాంగి నాట్యం చేసేదని అంటారు. వరదయ్య ముందుగా గుంటూరు జిల్లాలోని బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శించాడు. (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపింలేదా?)
అనంతరం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని, తరువాత శ్రీశైలంలోని మల్లికార్జునస్వామిని, హంపి హేమాద్రి నిలయుని దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరి ఇనపురి స్వామి, దేవుని కడప వేంకటేశ్వరస్వామి, తిరుపతి వేంకటేశ్వరస్వామి, ఇంకా ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు.
చిదంబరం గోవిందస్వామిని తిల్ల గోవిందస్వామి అని కీర్తించాడు. చిదంబరం పాలకుడైన కృష్ణప్ప నాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. కంచి, రామేశ్వరం,శ్రీరంగం క్షేత్రాలను దర్శించాడు. 1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైనది. గోల్కొండ సైన్యాధిపతి మీర్ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు. ఆ నవాబు ఆస్థానంలో క్షేత్రయ్య చాలాకాలం ఉండి 1500 పదాలు వ్రాసాడు.
తిరుగు ప్రయాణంలో భద్రాచలం తాసిల్ధార్ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించాడు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చాడు. 4,500 పదాలకు పైగా రచించాడు.ఈ నాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి. ఆయన పదకవితలు నేటికి సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలచి ఉన్నాయి.