వెంగమాంబ క్రీ. శ. 1800 ప్రాంతములో తరిగొండ గ్రామములో(చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలం) వాసిష్ట గోత్రికుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక బ్రాహ్మణ దంపతులకు జన్మించినది. వెంగమాంబకు బాల్యం నుండి భక్తి అలవడినది. చిన్న వయసులోనే అనేక భక్తిపాటలను కూర్చి మధురముగా పాడేది.
తండ్రి ఆమెలోని నైపుణ్యమును గమనించి సుబ్రమణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకై పంపాడు. దీక్షితులు కూడా ఆమెలోని నైపుణ్యమును గమనించి తనకు తెలిసిన విద్యనంతా వెంగమాంబకు బోధించాడు. కొద్ది కాలంలోనే వెంగమాంబ గురించి నలుమూలలకు పాకటంతో తండ్రి ఆమె విద్యాభ్యాసము మాన్పించి తగిన వరునికోసం వెతుకులాట ప్రారంభించాడు. అనేకమంది వరులు ఆమెను చూసి ఆమె చాలా అందంగా ఉన్నదనో లేక చాలా తెలివైనదనో నెపంతో పెళ్ళి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటప్ప ఆమె అందమునకు ముచ్చటపడి వెంగమాంబను వివాహము చేసుకొనుటకు అంగీకరించాడు. వివాహనంతరము వెంకటాచలప్ప ఆమె భక్తిమౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసి విఫలుడయ్యాడు.
వెంకమాంబ అతనిని దగ్గరకు రానివ్యలేదు. తరువాత భర్తను కోల్పోయింది. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన బాలవితంతువు. తరువాత ఈమె తిరుమలకు చేరి ఆలయానికి ఉత్తరాన దట్టమైన అడవులలో తుంబుర కోన వద్ద యోగాభ్యాసము చేస్తూ గడిపినట్లు తెలుస్తుంది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉండేవాడని అంటారు.
ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటి ముంగిటికి వచ్చే భోగ శ్రీనివాస మూర్తికి వెండిపళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఈ విషయం క్రీ.శ. 1890లో తూర్పు ఇండియా కంపెనీ వారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది.
తిరుమలకు ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం పాఠశాల) ఈమె సమాధి ఇప్పటికీ ఉన్నది. వెంగమాంబ రచనల్నీ వేదాంతము మరియు భక్తి ప్రధానమైనవి.
ఈమె రచనలలో ముఖ్యమైనవి....పద్యకావ్యములు : వేంకటాచల మహాత్యము, అష్టాంగ యోగసారము
ద్విపద కావ్యాలు : ద్విపద భాగవతము (ద్వాదశ స్కందము) రమాపరిణయము, రాజయోగామృత సారము, వాశిష్ట రామాయణము, శతకాలు, శ్రీకృష్ణ మంజరి, తరిగొండ నృసింహ శతకము, యక్షగానలు, నృసింహ విలాసము, శివలీలా విలాసము, బాలకృష్ణ నాటకము, విష్ణుపారిజాతము, రుక్మిణీ నాటకము, గోపీ నాటకము, చెంచునాటకము, ముక్తికాంతా విలాసము, జలక్రీడా విలాసము, తత్వ కీర్తనలు.