header

Aakakara Kaya / ఆకాకరకాయ

Aakakara Kaya / ఆకాకరకాయ
వర్షాకాలంలో మాత్రమే కనిపించే అరుదైన కూరగాయ ఆకాకరకాయ. ఆ రుచి తెలిసినవాళ్లు మాత్రం దాన్ని వదలకుండా తింటుంటారు. వీటిల్లో పోషకాలతోబాటు ఔషధ గుణాలూ బోలెడు.
వంద గ్రా. ఆకాకర కాయల నుంచి కేవలం 17 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. కానీ ఇందులో పీచూ ఖనిజాలూ విటమిన్లూ యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. గర్భిణులకి ఇది మంచి ఆహారం. అదీ నరాల సమస్యలు ఉన్నవాళ్లకి మరీ మంచిది. ఇందులో ఉండే ఫోలేట్లు పిండం పెరుగుదలకు ఎంతో దోహదపడతాయి.
పాలిపెప్టైడ్-పి అనే ఫైటో న్యూట్రియంట్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ను క్రమబద్ధీకరించి రక్తంలో చక్కెరశాతం పెరగకుండా చేస్తుంది. ఇంకా కాలేయ, కండరాల సమస్యల్నీ ఇది నియంత్రిస్తుంది.
ఇందులోని సి-విటమిన్ శరీరంలోని టాక్సిన్లను హరించడం ద్వారా క్యాన్సర్లనూ అడ్డుకుంటుంది.
అన్నింటికన్నా ఇందులో ఉండే కంటోలా అనే ఫ్లేవొనాయిడ్, వయసుమీదపడకుండా చర్మం కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. ఆకాకరలో విటమిన్-ఎ శాతమూ ఎక్కువే. అందుకే ఇది కంటిచూపుకీ మేలే. వైరస్లూ బ్యాక్టీరికారణంగా తలెత్తే దగ్గూ జలుబులకి ఇది మందులా పనిచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవాళ్లకీ ఇవి మంచివే. సుమారు రెండు టీస్పూన్ల పొడిని ఓ గ్లాసు పాలు లేదా నీళ్లలో కలిపి తాగితే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. అజీర్తి, మలబద్ధకంతో బాధపడేవాళ్లు వీటిని తరచూ తినడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది