కాకర కాయలు బాగా చేదుగా ఉంటాయి కాబట్టి వీటికి ‘‘బిట్టర్’’ గోల్డ్ అనే పేరు వచ్చింది. ప్రాచీన వైద్యంలో కాకరను విస్తృతంగా వాడేవారు.
ప్రయోజనాలు : డయాబెటిస్ నియంత్రణకు క్రమం తప్పకుండా కాకర వాడుతుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాకరలో ఉండే ఇన్సులిన్ వంటి పదార్థాలు ఇందుకు దోహదపడతాయి. కణలు గ్లూకోజ్‌ను గ్రహించడం మెరుగు పరచడమే కాకుండా ఇన్సులిన్ విడుదలను పెంచే గుణాన్ని, ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగు పరిచే లక్షణాన్ని కలిగివుంటుంది.
రక్తశుద్ధి: శారిరక వ్యవస్థను క్లెన్స్ చేయడానికి, రక్త సంబంధిత రుగ్మతలను నయం చేయటానికి ఆయుర్వేదంలో కాకర రసాన్ని ప్రతిరోజూ తీసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తారు. కాలేయం పునరుత్తేజానికి కూడా కాకర ఎంతగానో సహకరిస్తుంది
చర్మానికి పరిరక్షణ: దీనిలో రక్తాన్ని పరిశుద్ధ పరచగల గుణాలు చర్మాన్ని మచ్చలు, మొటిమల నుంచి పరిరక్షిస్తాయి. ఆయుర్వేదంలో ఎగ్జిమా, స్కిన్ ఇన్‌ఫెక్షన్లు, సొరియాసిస్ చికిత్సలో కాకరను వాడేవారు.
జీర్ణప్రక్రియ : కాకర జీర్ణక్రియను ఉద్ధీప్తం చేస్తుంది. దీనిలో గల అత్యధిక పీచుపదార్థం మబద్ధకం నుంచి కాపాడుతుంది. శారీరక వ్యవస్థ నిత్యం సక్రమంగా పనిచేయడంలో బాగా సహకరిస్తుంది.
మొల్లలు : ప్రతిరోజూ ఉదయం మజ్జిగలో కలుపుకుని కాకర రసం తాగుతుంటే మొల్లల సమస్య తగ్గుతుంది.
దృష్టి : కాకరలో బీటాకెరోటిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దృష్టికి సహకరిస్తుంది. మొత్తం మీద కాకరకాయ తినడం వలన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. హ్యాంగోవర్ల నుంచి కాపాడుతుంది. శరీరాన్ని విషతుల్యాలనుండి కాపాడుకోవడానికి, షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఉదయాన్నే పరగడుపున కాకరకాయ రసాన్ని తాగుతుండాలి. కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్ళలో మరిగించి వడకట్టుకుని డికాక్షన్ తయారుచేసుకోవచ్చు.
మంచి కాకరకాయలు : బాగా నిండు ఆకుపచ్చ రంగులో ఉండి, చర్మం గట్టిగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. కట్స్, మచ్చలు ఉన్నవి త్వరగా పాడయిపోతాయి. లేతగా తాజాగా బుడిపలున్నవయితే చేదు తక్కువగా ఉంటుంది. వీటిని గాలి చొరబడిని బ్యాగ్స్‌లో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. గాలి తగిలితే పండిపోతాయి.
కాకరకాయలను ఎవరు తినకూడదు : హైపోగ్లేజేమియా గలవారు కాకరకాయలు తినకూడదు. రసం తాగకూడదు.యుటేరిస్ స్టిమ్యులెంట్ గుణాలుంటాయి కాబట్టి గర్భవతులు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. డయాబెటిస్ నియంత్రణ మందులు వాడేవారు వైద్యులను సంప్రదించకుండా కాకర తినకూడదు. ఇలా తినడం వల్ల ఒక్కోసారి షుగర్ లెవెల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది.
కాకరకాయలతో తయారయ్యే పిల్స్ లేదా క్యాప్సుల్స్ వాడుతున్నట్లయితే కోర్సు మొదలు పెట్టే ముందు డాక్టరును తప్పకుండా సంప్రదించాలి.